Begin typing your search above and press return to search.

స‌వాలు విసిరేట‌ప్పుడు ఐడియా లేదా జూప‌ల్లి

By:  Tupaki Desk   |   12 July 2015 4:28 AM GMT
స‌వాలు విసిరేట‌ప్పుడు ఐడియా లేదా జూప‌ల్లి
X
రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య స‌వాళ్లు చాలా కామెడీగా ఉంటాయి. స‌వాలు ఏదైనా స‌రే.. దాన్ని వీలైనంత వ‌ర‌కూ మ‌సాలా క‌లిపి.. మ‌రింత రంజుగా త‌యారు చేస్తుంటారు. అలా అని.. మాట‌ల్లో తాము విసిరిన స‌వాలుకు త‌గ్గ‌ట్లే చేతల్లో చేసి చూపిస్తారా? అంటూ త‌ప్పులో కాలేసిన‌ట్లే. మాట‌ల్లో స‌వాల‌క్ష మాట‌లు చెప్పినా.. చేత‌ల‌వ‌ర‌కూ వెళితే మాత్రం కాస్త జాగ్ర‌త్త‌ప‌డి.. గ‌తంలో తాము అన్న మాట‌ల‌కు కొత్త అర్థాలు తీస్తూ త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంటుంది.

తాజాగా తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కానికి సంబంధించి రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య న‌డుస్తున్న వివాదానికి సంబంధించి తాను ఎలాంటి చ‌ర్చ‌కైనా సిద్ధ‌మేనంటూ తెలంగాణ తెలుగుదేశం నేత రావుకు తెలంగాణ మంత్రి జూప‌ల్లి సవాలు విసిరారు. రావుల కానీ ఓకే అంటే ఎక్క‌డికైనా వ‌చ్చి పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై టీడీపీ అనుస‌రిస్తున్న విధానాన్ని త‌ప్పు ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చారు.

దీనికి ప్ర‌తిగా స్పందించిన రావుల‌.. తేదీ.. స‌మ‌యం చెప్పిన జూప‌ల్లి కోసం పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ల‌యం వ‌ద్ద నాలుగు గంట‌ల పాటు వెయిట్ చేశాన‌ని.. అయిన‌ప్ప‌టికీ జూప‌ల్లి మాత్రం రాలేదంటూ ముఖాముఖిన పేర్కొన్నారు. దీంతో.. మంత్రి జూప‌ల్లి డిఫెన్స్ లో ప‌డిన ప‌రిస్థితి. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై జూప‌ల్లి స్పందించారు. పాపాల పుట్ట లాంటి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లొ అడుగుపెట్ట‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతోనే తాను రాలేక‌పోయిన‌ట్లు వెల్ల‌డించారు.

పార్టీ ఆఫీసుకువ‌స్తాన‌ని రాకుండా ముఖం చాటేసిన మంత్రి జూప‌ల్లి తాజాగా మ‌రో స‌వాలు విసిరారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంబంధించిన బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని పేర్కొన‌ట‌మే కాదు.. ఈసారి వెన్యూ విష‌యంలోనూ కాస్తంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. చ‌ర్చ‌ను అసెంబ్లీలో జ‌ర‌పాల‌ని.. దాన్ని మీడియా ప్ర‌తినిధులంతా ఉన్న‌ప్పుడే జ‌ర‌గాల‌ని చెబుతున్నారు. ఇలాంటి కండీష‌న్లు అన్ని ఓకే అంటే మొద‌ట అనుకున్న‌ట్లే తాను చ‌ర్చకు సిద్ధ‌మ‌ని జూప‌ల్లి చెబుతున్నారు. మ‌రిప్పుడు బంతి రావుల కోర్టులో ఉంది. మ‌రి.. ఈ బ‌హిరంగ చ‌ర్చ‌కు ఆయ‌న ఒకే అంటారా? లేదా అన్నది చూడాలి. అయినా.. క‌థ‌ను ఇక్క‌డివ‌ర‌కూ తీసుకొచ్చి.. ఇప్పుడు వెన్యూ మార్చ‌టం ఎందుకో? అయినా.. ఎన్టీఆర్ భ‌వ‌న్ కానీ పాపాల పుట్ట అయితే.. ఆ విష‌యాన్ని జూప‌ల్లి మొద‌లే చెబితే బాగుండేదేమో. స‌వాలు విసిరేట‌ప్పుడు లేని జాగ్ర‌త్త‌లు త‌ర్వాత మాత్రం భ‌లే వ‌స్తాయి క‌దూ.