Begin typing your search above and press return to search.

సెక్ష‌న్ 8 గొడ‌వ‌కు మ‌ర్మం ఇదా?

By:  Tupaki Desk   |   23 Jun 2015 4:34 PM GMT
సెక్ష‌న్ 8 గొడ‌వ‌కు మ‌ర్మం ఇదా?
X

హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేయడంపై ఇపుడు రెండు రాష్ర్టాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు రాష్ర్టాల ప్ర‌యోజ‌నాల కోసం ఉమ్మ‌డి రాజ‌ధానిలో సెక్షన్‌ 8 అమలు చేయాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలోని మంత్రులు, నేత‌లు డిమాండ్ చేస్తుండ‌గా....ఆ అవ‌స‌రం ఏముంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం, తెలంగాణ వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈవిష‌యంలో టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు ఘాటుగా స్పందించారు.

ఉమ్మ‌డి రాజ‌ధానిలో సెక్షన్‌ 8 అమలు చేయాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అస‌లు వ్య‌తిరేకించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరని ఆయ‌న ప్రశ్నించారు. సెక్షన్‌ 8 రాజ్యాంగం క‌ల్పించిన హక్కు అని, ఈ క్ర‌మంలో ఎవరి ఇష్టాయిష్టాలతో స‌ర్కారుకు పని లేదని ఆయన స్ప‌ష్టం చేశారు. గవర్నర్ వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి సెక్షన్-8 చెల్లదని చెప్పడం రాజ్యాంగ విరుద్దమని జూపూడి అన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో తన ప్రభుత్వం పడిపోతుందని భయపడే కేసీఆర్ సెక్షన్-8కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

హైదరాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని కాబ‌ట్టే రెండు రాష్ట్రాల పోలీసులకు పరిధి ఉందని అటార్నీ జనరల్ చెప్పారని, తాము కూడా ఇదే ఇంతకాలంగా చెబుతున్నామని జూపూడి అన్నారు. ఏపీ ఫోన్లు ట్యాప్‌ చేసి, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. స్థానికత, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, గురుకుల్‌ భూముల్లో ఇళ్ల కూల్చివేతలు ఇవన్నీ సెక్షన్‌ 8 కిందకు రావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏడాదిగా ఉల్లంఘనలు జరిగాయనడానికి కేసీఆర్‌ ప్రభుత్వానికి కోర్టులు ఎన్నోసార్లు మొట్టికాయలు వేయడమే నిదర్శనమని జూపూడి అన్నారు.

ఉద్దేశపూర్వకంగా స్టింగ్ ఆపరేషన్లు చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే తెలుగుదేశం పార్టీ గాజులు తొడుక్కుని కూర్చోదని చెప్పారు. సెక్షన్‌ 8పై ఇంత గొడవ జరుగుతున్నా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని జూపూడి ప్రశ్నించారు.