కేసీఆర్‌కు చిక్కులు తెస్తున్న ఫామ్ హౌస్
By: Tupaki Desk | 25 Jun 2015 1:44 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థలం ఆయన ఫామ్ హౌస్. విరామం కోసమయినా...వీలయినప్పుడు అయినా కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కు వెళుతుంటారు. తాజాగా అల్లం పంట సాగుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తరచుగా జగదేవ్ పూర్ మండలం ఎరవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు ద్వారా తెరమీదకు వచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కలిసి వెళ్లారు. తన తోటంతా కలియతిరిగిన కేసీఆర్ ఆ క్రమంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ను కూడా వెంటబెట్టుకున్నారు. అనంతరం దాదాపు గంటపాటు ఆయనతో ముచ్చటించారని వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ చేసిన చర్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఏం పని అని ప్రశ్నించారు. ఓటుకునోటు కేసులో... ఎమ్మెల్యేను ఇరికించిన వ్యక్తి, విచారణకు హాజరవుతున్న స్టీఫెన్ సన్‌తో కేసీఆర్ కబుర్లు చెప్పడం ఏం సంకేతాలను పంపిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి తోట అంతా కలియతిరిగి, కబుర్లు చెప్పే చనువు వారి మధ్య ఉంది కాబట్టే ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్మే కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు స్టీఫెన్‌సన్ వెళ్లినప్పుడు... మత్తయ్య అత్తవారింటికి వెళ్లకూడదా? అని జూపూడి నిలదీశారు.
స్టీఫెన్ సన్ వెంటబెట్టుకొని తోటలో తిరగడం, కేసుకు హాజరైన తర్వాత కేసీఆర్ తో సమావేశం అవడాన్ని బట్టే రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు ఎత్తు వేశారని స్పష్టమయిందని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కేసీఆర్ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఎమ్మెల్యేతో ఎత్తులు వేయించాడని మండిపడ్డారు. విచారణలో ఉన్న నిందితుడిని కలవడం ద్వారా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఏసీబీ ప్రభావితం అయి తన దర్యాప్తును ఏవిధంగా చేస్తుందో అర్థం అవుతుందన్నారు. సెక్షన్ 8 అడ్డుకునేందుకు, హైదరాబాద్‌లో తన తన ఒంటెద్దు పోకడల పాలన కొనసాగించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ముద్దుకృష్ణమ ఆరోపించారు. హైదరాబాద్‌పై తమకు పదేళ్ల పాటు ఉన్న హక్కులను వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు.