Begin typing your search above and press return to search.

అవేం మాటలు జూపూడి...

By:  Tupaki Desk   |   28 Jun 2015 10:36 AM GMT
అవేం మాటలు జూపూడి...
X
వైఎస్సార్సీపీ నుంచి ఇటీవలే టీడీపీలోకి జంప్ చేసి అధికార ప్రతినిధి పదవి దక్కించుకున్న జూపూడి ప్రభాకరరావు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేవిధంగా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఓటకునోటు కేసు, అందులో చంద్రబాబు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా...తెలుగుదేశం పార్టీని సైతం ఇబ్బందిపెట్టే విధంగా ఉన్నాయి.

'ఎన్నికలలో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటి? అసలు రాజకీయాలలో డబ్బు ఖర్చుపెట్టనిది ఎవరు? ఓట్లు కొనుగోలు చేయనిది ఎవరు?' అంటూ జూపూడి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మరిన్ని కామెంట్లు కూడా చేశారు. రాజకీయాలలో పతివ్రతలు ఎవరు ఉన్నారు? ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా ఎవరైనా గెలుస్తున్నారా అని జూపూడి ప్రశ్నించారు. రాజకీయాల్లోని పరిణామాలపై జూపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి పార్టీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేవిధంగా వ్యవహరించారని భావిస్తున్నారు.

జూపూడి వ్యాఖ్యలకు సరిగ్గా ఒక్కరోజు ముందే విజయవాడలో జరిగిన పార్టీ విస్త్రృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ నేతలు అవినీతికి, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. ప్రజాస్వామిక విధానాలతో ముందుకుపోతున్న పార్టీ కాబట్టే ఇన్నాళ్లు మచ్చలేని రాజకీయం చేసుకొచ్చినట్లు వివరించారు. చంద్రబాబు ఆలోచన సబబుగా ఉన్నప్పటికీ పార్టీ నేతలు ఇబ్బందికరంగా మాట్లాడటం తెలుగుదేశాన్ని చిక్కుల్లో పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.