Begin typing your search above and press return to search.

అరే..యువ‌రాజు కాదంట‌..కుటుంబ స‌భ్యుడంట‌!

By:  Tupaki Desk   |   21 Sep 2015 3:33 PM GMT
అరే..యువ‌రాజు కాదంట‌..కుటుంబ స‌భ్యుడంట‌!
X
పార్టీలో త‌న‌ను యువ‌రాజులా చూస్తుంటే మురిసిపోయే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ సోమ‌వారం కాస్తంత చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చాలానే చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన మ‌ధుర‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. కాసిన్ని ఆస‌క్తి రేపే వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తాను కాంగ్రెస్ నేత‌ల‌కు.. కార్య‌క‌ర్త‌ల‌కు నాయ‌కుడిగా తాను భావించ‌టం లేద‌ని.. త‌న కుటుంబ స‌భ్యుడిగా ఫీల్ అవుతున్నార‌ని ట‌చ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.
త‌న‌ను తాను నాయ‌కుడ్నికాద‌ని చెప్ప‌టంతో బిత్త‌ర‌పోయిన వారికి చివ‌ర్లో పంచ్ డైలాగు చెప్పి చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్న‌ప్ప‌టికీ.. వాస్త‌వం పాళ్లు ఎంతో రాహుల్ కు తెలియంది కాదు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీని బ‌ల‌ప‌ర్చేందుకు యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ మాదిరి క‌ష్ట‌ప‌డాలంటూ స్ఫూర్తి ర‌గిలించే ప్ర‌య‌త్నం చేశారు. యాపిల్ సంస్థ‌ను తీర్చిదిద్దేందుకు స్టీవ్ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో.. అంతేలా కాంగ్రెస్ నేత‌లు కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డాల‌న్న రాహుల్‌.. పార్టీ పున‌ర్ నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.

తాను నాయ‌కుడ్నికాదు.. కుటుంబ స‌భ్యుడ్ని అని చెప్పిన రాహుల్‌.. పార్టీలోని చోటా మోటా నాయ‌కులంద‌రిని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. చెప్పే మాట‌ల‌కు.. చేసే ప‌నుల‌కు సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే రాహుల్ లాంటి వారు నాయ‌కుల‌వుతారా? కుటుంబ స‌భ్యులు అవుతారా? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్టీవ్ జాబ్స్ మాదిరి క‌ష్ట‌ప‌డాల‌ని సందేశాలు ఇస్తున్న రాహుల్‌.. పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల సంగ‌తి త‌ర్వాత‌.. త‌న‌కు తాను ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో ఆత్మ‌ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కాంగ్రెస్ పార్టీని సొంత ఆస్తిగా భావించే గాంధీ ఫ్యామిలీకి చెందిన రాహులే ఎంత క‌మిట్‌ మెంట్‌ తో క‌ష్ట‌ప‌డే వారో అంద‌రికి తెలిసిందే.

పార్టీ అధికారంలో లేన‌ప్పుడు ఆవేశంతో ఊగిపోతూ మాట‌లు చెబుతున్న ఆయ‌న‌.. పార్టీ ప‌వ‌ర్‌ లో ఉన్న‌ప్పుడు.. ఆయ్య‌గారి పార్ల‌మెంటు స‌మావేశాల హాజ‌రీ ఎంత‌న్న‌ది చూస్తే ఆయ‌న క‌మిట్ మెంట్ ఇట్టే తెలుస్తుంది. అందుకే.. మాట‌లు చెప్పే ముందు త‌న‌కు తాను ఆచ‌రిస్తే బాగుంటుందేమో.