Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు త‌దుప‌రి సీజేఐ ఈయ‌నే!

By:  Tupaki Desk   |   7 Oct 2022 10:44 AM GMT
సుప్రీంకోర్టు త‌దుప‌రి సీజేఐ ఈయ‌నే!
X
భారతదేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న జస్టిస్‌ యుయు లలిత్‌ నవంబర్‌ 8న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. న‌వంబ‌ర్ 9 నుంచి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు.

ఈ మేర‌కు తదుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎంపిక‌లో భాగంగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వం ప్ర‌స్తుత సీజేఐ జ‌స్టిస్‌ యుయు లలిత్‌ను కోరింది. ఈ మేర‌కు చీఫ్ జస్టిస్ లలిత్కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది.దీంతో ఆయన తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తి పేరును కేంద్రానికి సిఫారసు చేయనున్నారు.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని త‌దుప‌రి సీజేఐగా సూచిస్తారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న వారిలో యుయు లలిత్‌ తర్వాత డీవై చంద్రచూడ్‌ సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. దీంతో ఆయ‌న పేరును సూచిస్తూ కేంద్రానికి ప్ర‌తిపాదించ‌డ‌మే లాంఛ‌న‌మే కానుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వారిని తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా త‌దుప‌రి సీజేఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టే జ‌స్టిస్ చంద్ర‌చూడ్ సుప్రీంకోర్టు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు 48 మంది ప్ర‌ధాన న్యాయ‌మూర్తులుగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం సీజేఐగా ఉన్న యుయు ల‌లిత్ 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.

కాగా ధ‌నుంజ‌య య‌శ్వంత్ చంద్ర‌చూడ్ (డీవై చంద్ర‌చూడ్) 1959లో జ‌న్మించారు. ఢిల్లీలో గ్రాడ్యుయేష‌న్ చ‌దివారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి 1982లో లా ప‌ట్టా పొందారు. హార్వ‌ర్డ్ లా స్కూల్ నుంచి ఎంఎల్ చేశారు. జ్యుడీషియ‌ల్ సైన్స్‌లో డాక్ట‌రేట్ కూడా సాధించారు. ప‌లువురు ప్ర‌ముఖ న్యాయ‌వాదుల వ‌ద్ద జూనియ‌ర్‌గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. అల‌హాబాద్ హైకోర్టుకు 2013లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

డీవై చంద్ర‌చూడ్ తండ్రి వైవీ చంద్ర‌చూడ్ కూడా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సుదీర్ఘ‌కాలం ప‌నిచేశారు. ఇప్పుడు డీవై చంద్ర‌చూడ్ కూడా సీజేఐగా బాధ్య‌త‌లు చేప‌డితే తండ్రీకుమారులు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తులుగా ప‌నిచేసిన రికార్డు సృష్టిస్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.