Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘ఫాంహౌస్’ ను రూ.5లక్షలకు ఇస్తారా?

By:  Tupaki Desk   |   7 Jun 2016 5:13 AM GMT
కేసీఆర్ ‘ఫాంహౌస్’ ను రూ.5లక్షలకు ఇస్తారా?
X
ఊహించని ప్రశ్న ఒకటి తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే విషయంలో రాజకీయపార్టీ అధినేతలు.. నేతలు సైతం వెనుకాముందు ఆడుతున్న వేళ.. అందుకు భిన్నమైన రంగాలకు చెందిన ప్రముఖుల నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొన్నటికి మొన్న తెలంగాణ రాజకీయ ఐకాస నేతగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి సంచలనం సృష్టిస్తే.. తాజాగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.

మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్.. దుబ్బాకలలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ల కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టటం తెలిసిందే. అయితే.. ఈ భూసేకరణ కోసం కోట్ చేసిన ధరలు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆసక్తికర ప్రశ్నను సంధించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ ను ఎకరం రూ.5లక్షలకు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. నిమ్జ్.. మల్లన్నసాగర్ భూనిర్వాసితులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన.. భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అంటూ సూటిగా ప్రశ్నించిన ఆయన నోటిఫికేషన్ లేకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ఒక్కరే రైతా? మిగిలిన వారంతా రైతులు కావా? అన్న ప్రశ్నలు సైతం ఈ ఆందోళన కార్యక్రమంలో వినిపించటం గమనార్హం. ఏకాఏకిన ముఖ్యమంత్రి ఫాంహౌస్ భూమి మీద మాజీ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి.. దీనిపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.