Begin typing your search above and press return to search.

హైకోర్టు విభజనకు దారి చెబుతున్న జస్టిస్ చంద్రకుమార్

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:35 AM GMT
హైకోర్టు విభజనకు దారి చెబుతున్న జస్టిస్ చంద్రకుమార్
X
విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి హైకోర్టు వ్యవహారం.. జడ్జిల నియామకానికి సంబంధించిన ఆందోళన తెలంగాణలో తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ తీరును తెలంగాణ అధికారపక్షం తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. హైకోర్టు విభజన అంశాన్ని రాజకీయం చేసే కన్నా.. ఏం చేస్తే పరిస్థితి మారుతుందన్న విషయాన్ని జస్టిస్ చంద్రకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదంపై రాజకీయాలకు అతీతంగా.. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన చంద్రకుమార్ మాటల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి. ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు అంశాల్ని వివరించారు.

హైకోర్టు విభజన జరగాలంటే ఏపీని తప్పు పట్టే కన్నా మొదట.. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30 సవరణకు తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుబట్టాలని.. ఆ చట్టంలో మార్పులు జరిగే వరకూ తెలంగాణకు సొంతంగా హైకోర్టు రాదన్న విషయాన్ని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు.తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుకు ప్రధాన పాత్ర తెలంగాణ ప్రభుత్వానిదేనని.. సెక్షన్ 30లో సవరణ కోరితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదన్నారు. ‘‘హైకోర్టును విభజించమని కేసీఆర్.. మరికొందరు అంటున్నారు. కానీ.. తొలుత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30పై సవరణ కోరాలి. అప్పటికి స్పందించకపోతే కేంద్రానిదే బాధ్యత అవుతుంది. జడ్జిల ఆప్షన్స్ విషయంలో చీఫ్ జస్టిస్ ది తప్పు లేదు. సెక్షన్ 30లో లోపమే దీనికి కారణం. ఈ సెక్షన్ ప్రకారం ఏపీ హక్కును ప్రశ్నించలేం. కొత్త హైకోర్టు నిర్మించే వరకూ ఉమ్మడి సేవలు తప్పవు’’ అని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా రాజకీయ అంశాన్ని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్రం ఒత్తిడి తేలేదని.. అలా చేస్తే అతి జోక్యానికి అవకాశం కల్పించినట్లే అవుతుందని చెప్పటం గమనార్హం. సెక్షన్ 30లోని లోపం ఏపీ ముఖ్యమంత్రికి ప్లస్ పాయింట్ గా మారిందన్న ఆయన..‘‘ఈ ఇష్యూకు పరిష్కారం సెక్షన్ 30 సవరణే. అయితే.. పార్లమెంటు సమావేశాల్లో కానీ.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ సెక్షన్ ను సవరిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని చెప్పారు. న్యాయవృత్తి హుందాతనంతో కూడుకున్నదని.. జడ్జిలు రోడ్ల మీదకు రావటం బాధాకరమని.. న్యాయపరంగా పోరాడితే న్యాయం తప్పక లభిస్తుందన్న ఆయన మాటలు విన్నప్పుడు సమస్యకు పరిష్కారం వెతికే కన్నా.. భావోద్వేగాల్నే రాజకీయ పార్టీలు ఎక్కువగా తట్టి లేపుతున్నాయన్న భావన కలగక మానదు. సమస్యకు పరిష్కారం కంటే కూడా పొలిటికల్ మైలేజ్ మీదనే దృష్టి పెట్టే ధోరణి తగ్గనంత వరకూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయేమో?