Begin typing your search above and press return to search.

ప్రైవ‌సీని హ‌క్కుగా తొలుత చెప్పింది తెలుగోడేన‌ట‌

By:  Tupaki Desk   |   25 Aug 2017 7:34 AM GMT
ప్రైవ‌సీని హ‌క్కుగా తొలుత చెప్పింది తెలుగోడేన‌ట‌
X
తొమ్మిది మంది స‌భ్యులున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. ఆధార్ వ్య‌క్తిగ‌త గోప్య‌త హ‌క్కును హ‌రిస్తుందంటూ సంచ‌ల‌న తీర్పు ఇవ్వ‌టం తెలిసిందే. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌.. వ్య‌వ‌హారికంగా త‌ర‌చూ మాట‌ల్లో వ‌చ్చే ప్రైవ‌సీ అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఇంత‌లా మాట్లాడుకుంటున్న ప్రైవ‌సీని ప్రాథ‌మిక హ‌క్కుగా చెబుతున్నా.. కొన్ని ద‌శాబ్దాల క్రితం ఇదే విష‌యాన్ని చెబితే ఎవ‌రూ అర్థం చేసుకోలేదంటే న‌మ్మ‌లేం. కానీ.. అది నిజం. ప్రైవ‌సీ అన్న‌ది ప్రాథ‌మిక హ‌క్కు అంటూ తొలిసారి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో తాను రాసిన తీర్పులో ప్ర‌స్తావించిన వ్య‌క్తి ఒక తెలుగోడు కావ‌టం విశేషం. ఒక వ్య‌క్తి ప్రైవ‌సీకి అమిత‌మైన ప్రాధాన్య‌త ఇవ్వ‌ట‌మే కాదు.. అది ప్రాథ‌మిక హ‌క్కుగా త‌న తీర్పులో చెప్పిన తొలి దేశీయ న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ కోకా సుబ్బారావును చెప్పాలి.

రాజ‌మ‌హేంద్రవ‌రానికి చెందిన ఆయ‌న మ‌ద్రాసు లా కాలేజీలో చ‌దివారు. ఉమ్మ‌డి మ‌ద్రాసు రాష్ట్ర హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాతి కాలంలో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా.. త‌ర్వాత ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

1964లో ఖ‌రాక్ సింగ్ వ‌ర్సెస్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య ఒక కేసు న‌డిచింది. త‌న ప్రైవ‌సీ హ‌క్కును పోలీసులు భంగ‌ప‌ర్చిన‌ట్లుగా ఖ‌రాక్ సింగ్ వాదించాడు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21లో చెప్పిన‌ట్లుగా ప‌ర్స‌న‌ల్ లిబ‌ర్టీ (వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌) క్లాజ్ ప్ర‌కారం త‌న‌కు సంక్ర‌మించిన ప్రాథ‌మిక హ‌క్కుగా పేర్కొంటూ.. దాన్ని పోలీసులు అతిక్ర‌మించార‌ని పిటీష‌న‌ర్ వాదించారు. అయితే.. మెజార్టీ న్యాయ‌మూర్తులు ప్రైవ‌సీ హ‌క్కును ఆర్టిక‌ల్ 21 ప‌రిధిలో గుర్తించ‌టానికి నో చెప్పారు.

అయితే.. వారికి భిన్నంగా జ‌స్టిస్ కోకా సుబ్బారావు మాత్రం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను ఆర్టిక‌ల్ 21లో భాగంగా చూశారు. దేశంలో తొలిసారి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌లో ప్రైవ‌సీ హ‌క్కుగా చూసిన సంద‌ర్భంగా చెప్పాలి. దాన్ని గుర్తించింది ఒక తెలుగువాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. నాడు జ‌స్టిస్ కోకా సుబ్బారావు ప్రైవ‌సీ గురించి ప్ర‌స్తావించినా.. ఐదుగురు స‌భ్యులున్న ధ‌ర్మాస‌నంలోని మిగిలిన వారు ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఇన్నేళ్ల త‌ర్వాత ఆధార్ విష‌యంలో తొమ్మిది మంది స‌భ్యులున్న సుప్రీం ధ‌ర్మాస‌నం ప్రైవ‌సీని ప్రాథ‌మిక హ‌క్కుగా గుర్తించాలంటూ సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. నేటి ఆధార్ తీర్పున‌కు జ‌స్టిస్ కోకా సుబ్బారావు స్ఫూర్తిగా నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాజా ఆధార్ తీర్పులోనూ వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు సంబంధించిన అంశాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ఈ తీర్పును చెప్పిన తొమ్మిది మంది ధ‌ర్మాస‌నంలోనూ ఒక తెలుగోడు (జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌) ఉండ‌టం గ‌మ‌నార్హం.