Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారుపై సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి ఫైర్‌

By:  Tupaki Desk   |   17 May 2017 10:17 AM GMT
బాబు స‌ర్కారుపై సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి  ఫైర్‌
X
ఏపీ రాష్ట్ర స‌ర్కారుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి మార్కండేయ క‌ట్జూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై ఏపీ స‌ర్కారు కేసులు పెట్టి ఆరెస్టులు చేయ‌టంపై ఆయ‌న ఫైర్ అయ్యారు. సోష‌ల్ మీడియా స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌ల అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధంగా ఆయ‌న తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాల పెట్టిన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.

వ్యంగ్య వ్యాఖ్య‌లు.. కార్టూన్లు భావ స్వేచ్ఛ ప్ర‌క‌ట‌న‌లో భాగంగా చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే హ‌క్కు పౌరుల‌కు ఉంద‌న్న ఆయ‌న‌.. పొలిటిక‌ల్ పంచ్ ఆడ్మిన్ ర‌వికిర‌ణ్ అరెస్ట్‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆర్టిక‌ల్ 19(1ఏ) ప్ర‌కారం ప్ర‌తి పౌరుడికి ల‌భించిన హ‌క్కుగా చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ‌వేత్త‌ల్ని విమ‌ర్శించే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంద‌న్నారు.

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువుల‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరు అనాగ‌రికంగా ఉంద‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వాన్ని వెంట‌నే డిస్మిస్ చేయాల‌న్న ఆయ‌న‌.. బాబు స‌ర్కారుపై ఆర్టిక‌ల్ 356ను ప్ర‌యోగించాల‌ని.. రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయ‌టాన్ని త‌ప్పు ప‌డుతూ రాష్ట్రప‌తి.. ప్ర‌ధానికి క‌ట్జూ లేఖ‌లు రాశారు. సోష‌ల్ పోస్టుల‌పై త‌మ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న ఆగ్ర‌హావేశాల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో?