Begin typing your search above and press return to search.

ఎన్వీ ర‌మ‌ణ కీర్తి ... తర్వాత తెలుగు వారు ఎవరు?

By:  Tupaki Desk   |   24 April 2021 6:47 AM GMT
ఎన్వీ ర‌మ‌ణ కీర్తి ... తర్వాత తెలుగు వారు ఎవరు?
X
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా మ‌న తెలుగు తేజం, కృష్ణాజిల్లాకు చెందిన జ‌స్టిస్‌ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ‌.. ఉర‌ఫ్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఈ రోజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కేంద్ర కేబినెట్ హోదాతోపాటు.. దేశ‌వ్యాప్తంగా ఉన్న కీల‌క‌మైన ప‌ద‌వుల్లో తొలి స్థానం రాష్ట్ర‌ప‌తిదైతే.. దీనికి త‌త్స‌స‌మాన ప‌ద‌విగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విని పేర్కొంటారు. అంత‌టి కీల‌క ప‌ద‌విలో కూర్చున్న రెండో తెలుగు తేజం మ‌న ఏపీ వాసి కావ‌డం అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.

గ‌తంలో దివంగ‌త జ‌స్టిస్‌ కోకా సుబ్బారావు.. 9వ భార‌త ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తిగా తొలిసారి ఏపీ నుంచి ఎంపిక ‌య్యారు. 1966, జూన్ 30న కోకా సుబ్బారావు భార‌త సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఎంపిక‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టికి అంటే.. దాదాపు 54 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ అత్యున్న‌త శిఖ‌రంపై కొలువుదీర‌నున్నారు. ఈయ‌న వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 26వ తేదీ వ‌ర‌కు ప‌ద‌విలో ఉంటారు. అంటే.. దాదాపు 16 నెల‌ల‌పాటు ఆయ‌న సుప్రీం కోర్టు చీఫ్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

అయితే.. ఎన్వీ ర‌మ‌ణ త‌ర్వాత ఎవ‌రు.. ఏ తెలుగు వారు.. ఈ స్థాయిలో సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయ్యే అవ‌కాశం ఉంది.. అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. దీనికి స‌మాధానం.. ఇప్ప‌ట్లో లేద‌నే అంటున్నారు న్యాయ నిపుణులు. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు జ‌స్టిస్ లావు నాగేశ్వ‌ర‌రావు.. వంటివారు ఉన్న‌ప్ప‌టి కీ.. వారు త్వ‌ర‌లోనే రిటైర్ కానున్నారు. దీంతో ఇప్ప‌ట్లో సుప్రీం కోర్టులో ఇంత‌టి కీర్తిని ఆర్జించేవారు లేర‌నే అంటున్నారు.

ఇప్ప‌టికే సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌.. వంటివారు చేసినా.. ఈ స్థాయికి రాలేక పోయారు. ఇప్పుడు ఈ స్థాయికి వ‌చ్చే న్యాయ‌మూర్తులు కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఇప్ప‌టి త‌రానికి.. రాబోయే త‌రానికి కూడా తెలుగు వ్య‌క్తిని సుప్రీం పీఠంపై చూసే అదృష్టం.. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌తోనే స‌రిపెట్టుకోవాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.