Begin typing your search above and press return to search.

పెద్దరికాన్ని ప్రదర్శించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

By:  Tupaki Desk   |   2 Aug 2021 11:43 AM GMT
పెద్దరికాన్ని ప్రదర్శించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
X
అంతకంతకూ పీటముడి పడుతున్న సమస్యను పరిష్కరించటానికి ఉన్న ఏకైక మార్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించటం. అయితే.. న్యాయమూర్తిగా కూర్చున్న పెద్ద మనిషికి.. సమస్య మీద అవగాహన ఉండటమే కాదు.. కూర్చొని మాట్లాడుకుంటే పోయేదానికి.. లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారన్న విషయం తెలిసినప్పుడు ఏం చేస్తారు? పెద్ద మనిషి తరహాలో సలహాను ఇస్తారు. గడిచిన కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు పెద్ద మనిషి లేనితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటివేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అర్థమయ్యేలా కీలక వ్యాఖ్య చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

గడిచిన కొద్దికాలంగా కృష్ణా జ‌లాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న విషయం తెలిసిందే. తమకు నచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవటం.. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకోవటమే కాదు.. ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటారు. ఆ సందర్భంగా తాము తీసుకునే నిర్ణయాలు రెండు రాష్ట్రాల ప్రజలకు అంగీకారమా? లేదా? అన్నది పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెబితే.. అదో విషయం కాదన్నట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అదే సమయంలో.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏదైనా తేడా వచ్చినంతనే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకోవటం.. దూకుడునిర్ణయాలు తీసుకోవటం.. ఎడాపెడా కేసులు పెట్టుకుంటూ న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎక్కువైంది.

నిజానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. వారి భావోద్వేగాల్ని తరచూ టచ్ చేస్తున్న పాలకుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. నిజానికి కృష్ణా జ‌లాలకు సంబంధించిన వివాదాన్ని చూస్తే.. నిజంగానే సోదర తెలుగు రాష్ట్రానికి సమస్యగా ఉంటే.. ఒకరికొకరు సహకరించుకోవటంలో తప్పు లేదు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. దానికి దోచుకెళుతున్నారు.. దోపిడీకి పాల్పడుతున్నారంటూ విమర్శలు చేయటంలో అభ్యంతరం లేదు. నిజానికి జరుగుతున్న పరిణామాల మీద ప్రజలకు అవగాహన ఉన్నప్పటికి.. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

కలిసి కూర్చొని మాట్లాడితే సరిపోయే దానికి భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. తెలుగువాడు.. రెండు తెలుగు రాష్ట్రాల మీద అవగాహన ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలుసిసలు పెద్దరికాన్ని ప్రదర్శించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు (సోమవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జ‌లాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ.. తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు.

నదీ జలాలకు సంబంధించి బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది కాబట్టి ఏపీ పిటిషన్ పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయమవాది వాదిస్తే.. కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ లోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉందని.. వెంటనే గెజిట్ ను అమలు చేయాలని ఏపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరువురు న్యాయవాదులు చేసిన వాదనల్ని విన్న జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ వివాదంపై గతంలో తనకున్న అనుభవాన్ని గుర్తు చేశారు. అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కావలంటే కేంద్రం నుంచి అదనపు సూచనలు.. సలహాలకు సంబంధించి విచారణను వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామన్నారు.ఈ సందర్భంగా తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న విషయాన్ని ఆయన గుర్తు చేయటం గమనార్హం. ఈ పిటిషన్ మీద విచారణను బుధవారానికి వాయిదా వేశారు. మరి.. జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సూచనకు తగ్గట్లు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరిస్తారా? లేదంటే.. సుప్రీంకోర్టులో వాదనలు.. లాజిక్కులతో అదే పనిగా విషయాన్ని మరింత ముదిరేలా చేస్తారా? అన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి.