Begin typing your search above and press return to search.

మిస్ అవుతున్న నీతిని.. క‌థ‌గా చెప్పిన సీజే!

By:  Tupaki Desk   |   17 May 2019 5:31 AM GMT
మిస్ అవుతున్న నీతిని.. క‌థ‌గా చెప్పిన సీజే!
X
ఆశ స్థానంలో అత్యాశ చేరిపోయి చానా కాల‌మే అయ్యింది. ఎవ‌రికి వారికి.. త‌మ స్వార్థ‌మే త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ని రోజులివి. ఇలాంటివేళ‌.. ప్ర‌తి ఒక్క‌రిలో ఉండాల్సిన నీతి గురించి చెప్పిన మాట ప్ర‌తిఒక్క‌రూ గుర్తుంచుకోవాల్సిందే. తాజాగా తెలంగాణ హైకోర్టుతాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు.

ప‌రిహారం అంద‌లేద‌నో.. మ‌రో కార‌ణం చేత‌నో ప్రాజెక్టుల్ని ఆపే ప్ర‌య‌త్నం స‌రికాద‌న్న మాట‌ను చెప్పిన ఆయ‌న‌.. ఒక నీతి క‌థ‌ను గుర్తు చేశారు. ''నది ఒడ్డున ఓ వ్యక్తి చెట్టును కొడుతుండగా గొడ్డలి నదిలో పడిపోతుంది. అప్పుడు దేవత ప్రత్యక్షమై బంగారు, వెండి గొడ్డళ్లను చూపించగా అవి తనవి కావని చెబుతాడు. చివరికి ఇనుప గొడ్డలిని చూపించగా అదే తనదని నిజాయితీగా చెబుతాడు. అప్పుడు దేవత అతని నిజాయితీని మెచ్చుకొని ఇనుప గొడ్డలితోపాటు బంగారు, వెండి గొడ్డళ్లను కూడా అతనికే ఇస్తుంది. అలాగే ఎవరైనా నిజాయితీగా తమకు రావాల్సిన దాన్ని మాత్రమే కోరుకోవాలి. అత్యాశకు పోవడం సరికాదు'' అని పేర్కొన్నారు.

నిజ‌మే.. త‌మ అవ‌స‌రం.. త‌మ స్వార్థ‌మే త‌మ‌కు ముఖ్యం త‌ప్పించి.. అంద‌రి కోసం త‌మ‌కు ఎదుర‌య్యే కాసింత ఇబ్బందిని అధిగ‌మిద్దామ‌న్న భావ‌న లేని వారికి.. తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు చాలా అవ‌స‌రం. నీతిగా ఉండాల్సిన స‌మాజం.. అత్యాశ‌తో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వేళ.. సీజే నోటి నుంచి వ‌చ్చిన నీతిక‌థ అంద‌రూ గుర్తుంచుకోవాల్సిందేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.