Begin typing your search above and press return to search.

సజ్జన్నార్ కు ‘తెలుగు’ రాదా? జస్టిస్ సిర్పుర్కర్ విచారణలో కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   13 Oct 2021 3:31 AM GMT
సజ్జన్నార్ కు ‘తెలుగు’ రాదా? జస్టిస్ సిర్పుర్కర్ విచారణలో కీలక వ్యాఖ్యలు
X
‘దిశ’ ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఎదుట హాజరైన నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ పెద్ద ఎత్తున ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో విచారణను ఎదుర్కొన్న వారిలో ఆయనకే ఎక్కువ ప్రశ్నలు ఎదురైనట్లుగా చెప్పక తప్పదు. ఈ సందర్భంగా సజ్జన్నార్ తెలుగు భాషా ప్రావీణ్యం మీదా విచారణలో భాగంగా ప్రశ్నలు ఎదుర్కోవటం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగును తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే పొరపాటు పడి ఉంటానని విచారణలో వ్యాఖ్యానించటం కీలకంగా మారింది. దీనికి ఆయన్ను కమిషన్ ఒక ఆసక్తికర ప్రశ్నను సంధించింది. ‘తెలుగు రాష్ట్రానానికి ఐపీఎస్ గా ఎంపికైనప్పుడు ఆ భాషలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి కదా?’ అని అడిగితే అవునని చెప్పారు. అలాంటప్పుడు ఇన్ని రోజులు తెలుగు అర్థం చేసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ కమిషన్ ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన సజ్జన్నార్.. తన మాత్రభాష కన్నడకు తెలుగుకు దగ్గరి సంబంధం ఉండటంతోతనకు తెలుగు రాయటం.. చదవటం తెలుసని.. మాట్లాడటమే పూర్తిగా తెలీదని వ్యాఖ్యానించటం గమనార్హం. రెండు రోజుల పాటు సాగిన విచారణలో సజ్జన్నార్ ను కమిషన్ ఏకంగా 160 ప్రశ్నల్ని సంధించింది. మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

సజ్జన్నార్ చెప్పినట్లుగా ఆయనకు తెలుగు మాట్లాడటం అంతగా రాదా? అన్నది చర్చగా మారింది. ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిసిన వారు.. ఆయన చెప్పిన మాటల్లో పాక్షికంగా నిజం ఉందని చెబుతున్నారు. తెలుగులో స్పష్టంగా మాట్లాడే సజ్జన్నార్.. ఎవరైనా టిపికల్ తెలుగు మాట్లాడినా.. భాషకు సంబంధించి వివిధ ప్రాంతాల యాసల్ని అంత బాగా అర్థం చేసుకునే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. తెలుగు భాష తెలిసినప్పటికీ.. పూర్తిస్థాయిలో పట్టు లేదనే విషయం వాస్తవమే అన్న మాట ఆయన గురించి బాగా తెలిసిన వారు అభిప్రాయపడుతుండటం కనిపిస్తోంది.