Begin typing your search above and press return to search.

సమగ్ర సర్వే... దేశవ్యాప్తంగా

By:  Tupaki Desk   |   11 April 2015 6:52 AM GMT
సమగ్ర సర్వే... దేశవ్యాప్తంగా
X

సమగ్ర కుటుంబ సర్వే..తెలంగాణ పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ అంతటా ఒకేరోజు ఈ సర్వే నిర్వహించింది. మొదట సీమాంధ్రులను గుర్తించేందుకని, ఆ తర్వాత కేవలం స్పష్టమైన వివరాల కోసమేనని, ఏ పథకంతో లింకు పెట్టమని చెప్పిన సర్కారు...అన్నింటికీ సమగ్ర సర్వేతోనే ముడివేసింది. అయితే ఈ సర్వే ద్వారా సర్కారుకు దాదాపు స్పష్టమైన సమాచారం దొరికిందనే చెప్పవచ్చు. కొన్ని విమర్శలున్న మాట కూడా వాస్తవం. తాజాగా ఈ సర్వేను దేశమంతటా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది!

జాతీయ బీసీ కమిషన్ మూడ్రోజులుగా రాష్ర్టంలో పర్యటిస్తోంది. బీసీ జాబితాలోని కులాల మార్పు-తొలగింపు తదితర అంశాలపై బహిరంగ విచారణ చేస్తోంది. ఈ సందర్భంగా ఒక్కోరోజు కొన్ని కులాల వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విచారణకు హాజరైన సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ ను తొలగించవద్దని కోరారు. తమ వర్గం వారికి న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ 1631 తర్వాత దేశంలో కులాల వారి వివరాలు అందుబాటులో లేవన్నారు. వారందరినీ గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ప్రజలు ఉన్నారని చెప్పారు. ముస్లింలకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఓట్ల కోసం పలు పార్టీలు వారిని మోసం చేశాయని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు అనుభవించి అభివృద్ధి చెందిన పలు కులాలు తమను జాబితాలోంచి తొలగించాలని ఎక్కడా చెప్పడం లేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే గత రెండేళ్లలో 30 కులాలను బీసీ జాబితాలో చేర్చారని వ్యాఖ్యానించారు.

వివిధ వర్గాల సమస్యలను తాము తెలుసుకున్నామని, వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పారు.