Begin typing your search above and press return to search.

ఆపరేషన్ ఆకర్ష్...టార్గెట్ వైసీపీ...?

By:  Tupaki Desk   |   15 April 2022 4:28 AM GMT
ఆపరేషన్ ఆకర్ష్...టార్గెట్ వైసీపీ...?
X
ఏపీలో అధికార పార్టీ నిండా జనాలతో కిటకిటలాడుతోంది. అన్ని పార్టీల నేతలు గంపగుత్తగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఇక అన్ని రకాలైన సమీకరణలు కలసి వచ్చి వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే అంత పెద్ద మెజారిటీయే ఇపుడు బరువుగా మారింది. పదవుల విషయంలో పెద్ద ఎత్తున అసంతృప్తులు చెలరేగడానికి కూడా కారణం అవుతోంది.

తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆశలు పెట్టుకున్న వారిలో చాలా మందికి పదవులు దక్కలేదు. సీనియర్లూ జూనియర్లూ అన్న తేడా లేకుండా ఇపుడు అనేక మంది మనసులోనే తీవ్ర వేదన అనుభవిస్తున్నారు అని అంటున్నారు. వారిని బుజ్జగించి ఇప్పటికైతే సరే అనిపించినా రానున్న రోజుల్లో వారు తమ దారి చూసుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

రెండేళ్ళకు పైగా వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇపుడు బయటపడకుండా తమకు ఉన్న అవకాశాలను అసంతృప్త నేతలు మౌనంగానే వెతుక్కుంటారు అని అంటున్నారు. అదే టైమ్ లో వైసీపీలో అసంతృపుత నేతల మీద విపక్షాల కన్ను పడింది అంటున్నారు. దీని మీద ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు చెప్పేశారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు టీడీపీలోకి వస్తాయని ఆయన అంటున్నారు.

అది నిజం కూడా కావచ్చు. వైసీపీలో బాధ కలిగితే ఆల్టర్నేషన్ గా ఫస్ట్ చాయిస్ గా టీడీపీనే ఎన్నుకుంటారు. ఇపుడు కాకపోయినా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ రకమైన వలసలు ఉండవచ్చు. మరో వైపు బీజేపీ కూడా వైసీపీలో అసంతృప్తుల మీద ఒక లుక్కేసి ఉంచిందని అంటున్నారు.

దీని మీద రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లాంటి వంటి వారు అయితే పెద్ద ఎత్తున తమ పార్టీలోకి వలసలు ఉంటాయని చెప్పుకున్నారు. అంటే బీజేపీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తోంది అంటున్నారు. ఇక వైసీపీలో ఉన్న వారిలో చాలా మందికి టికెట్లు దక్కవని తెలిస్తే వారంతా కూడా పక్క పార్టీలలోకి జంప్ అవడం ఖాయమని అంటున్నారు.

మొత్తంగా చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ కి ఏపీలో విపక్షాలు తెర తీస్తున్నాయి అని తెలుస్తోంది. మరి బడా నేతల నుంచి జూనియర్ల వరకూ పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బయటకు రానున్నారు అన్న ప్రచారం సంచలనం రేపుతోంది. చూడాలి మరి ఆ డేటూ టైమూ ఎపుడు పెట్టుకున్నారో.