Begin typing your search above and press return to search.

బాగా ఆడితే చాలదు..రికమండేషన్స్ కూడా!!

By:  Tupaki Desk   |   26 Jan 2017 4:37 AM GMT
బాగా ఆడితే చాలదు..రికమండేషన్స్ కూడా!!
X
గుత్తా జ్వాల.. చాలారోజులైంది ఆమె వార్త‌ల్లోకి వ‌చ్చి! ఆ మ‌ధ్య బ్యాట్మింట‌న్ ఆఫ్ ఇండియా మీదా, స్పోర్ట్స్ అథారిటీ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ గుత్తా హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అదే స్థాయి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. వ్య‌వ‌స్థ‌ను క‌డిగేస్తూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ఒక భారీ పోస్ట్ పెట్టింది. తాజా సంద‌ర్భం ఏంటంటే.. భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం..! ప‌ద్మ అవార్డుల జాబితాలో త‌న పేరు లేక‌పోవ‌డంతో గుత్తా జ్వాల తీవ్ర అసంతృప్తికి గురైంది. క్రీడాకారిణిగా 15 ఏళ్ల‌పాటు దేశానికి తాను చేసిన సేవ‌కు ల‌భిస్తున్న గుర్తింపు ఇదేనా అంటూ ప‌ద్మ అవార్డు జ్యూరీ మీదా, వ్య‌వ‌స్థ మీదా మండిప‌డింది.

దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుకు అప్లై చేయ‌డంలో ఎలాంటి ప‌ద్ధ‌తిని ఫాలో కావాలో త‌న‌కు అర్థం కావ‌డం లేదంటోంది గుత్తా జ్వాల‌. ‘ప‌దిహేనేళ్ల‌పాటు దేశం కోసం ఆడాను. ఎన్నో అవార్డు సాధించాను. కాబ‌ట్టి... ఆ అవార్డుకు అస‌లైన‌ అర్హురాలిని అని భావించాను. కానీ, నాకు అర్థ‌మౌతున్నది ఏంటంటే.... బాగా ఆడినంత మాత్రాన‌ చాల‌దు, కొన్ని రిక‌మండేష‌న్లు కూడా ఉండాల‌న్న‌ది స్ప‌ష్ట‌మౌతోంది. సిఫార్సులు ఉంటే త‌ప్ప అవార్డులు రావు. ఏదైనా సాధించినంత మాత్రాన చాల‌ద‌న్న‌మాట‌..? తాజాగా వ‌రుస‌గా రెండు మెడ‌ల్స్ సాధించాను, వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ మెడ‌ల్స్ చాలానే ఉన్నాయి, డ‌బుల్స్ మిక్స్‌డ్ డ‌బుల్స్ లో టాప్ 10 ర్యాంకు, గ్రాండ్ పిక్స్ గోల్డ్‌, 15 సార్లు నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌, భార‌తదేశ చ‌రిత్ర‌లోనే రెండుసార్లు ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన తొలి మ‌హిళా క్రీడాకిరిణిని... ఈ ట్రాక్ రికార్డ్ ఏదీ స‌రిపోలేదా..? దేశంలోని అత్యున్న‌త పుర‌స్కారాన్ని అందుకోవ‌డానికి ఇవేవీ చాల‌వ‌న్న‌మాట‌’ అంటూ సోష‌ల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది జ్వాల.

ఈ అవార్డు గురించి ఎవ‌రిని ఎలా అడ‌గాలో త‌న‌కు ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌నీ, త‌న‌కు ఎందుకు ఇవ్వ‌డం లేదో ఆ కార‌ణం తెలిసినా కాస్త ప్ర‌శాంతంగా ఉంటుంద‌న్న ఆవేద‌న గుత్తా వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే చాలామంది క్రీడాకారుల‌కు ప‌ద్మ అవార్డులు వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈసారి త‌న‌కు అవార్డు వ‌స్తుంద‌ని గుత్తా చాలా హోప్స్ పెట్టేసుకున్న‌ట్టుగా ఉంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబితాలో పేరు లేక‌పోయేస‌రికి ఇలా అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతోంది. అయినా... ఇలా అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కాక అవార్డు వ‌చ్చినా అది గుర్తింపు అవుతుందా... ఆవేద‌న‌కు సాంత్వ‌న మాత్ర‌మే అవుతుంది క‌దా..!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/