Begin typing your search above and press return to search.

జ్యోతుల నెహ్రూ వేదాంతం మాట్లాడ‌మేంటి?

By:  Tupaki Desk   |   5 April 2016 4:43 PM GMT
జ్యోతుల నెహ్రూ వేదాంతం మాట్లాడ‌మేంటి?
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప‌నేత హోదాలో ఉండి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరబోతున్న సీనియ‌ర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హైద‌రాబాద్‌ లో మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీకి టాటా చెప్పిన‌ప్ప‌టికీ ఇంకా అధికారికంగా టీడీపీలో చేర‌ని నెహ్రూ త‌న రాజ‌కీయ అడుగుల గురించి ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని చెప్పుకొచ్చారు. పార్టీలు మారే విషయంలో తన విశ్వసనీయతను ప్రశ్నించవద్దని నెహ్రూ కోరారు. తన వయసు 64 ఏళ్లని, ఇంకా రాజకీయాల్లో సాధించాల్సిన లక్ష్యాలు ఏమీ లేవని చెప్పుకొచ్చారు.

అంతేకాదు తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జ్యోతుల నెహ్రూ చెప్పారు. నాయకుల్ని తయారు చేశానని చెప్పిన ఆయన, తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడో, రాడో చెప్పలేనని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్ గురించి ప్రస్తుతానికి ఏమీ నిర్ణయించుకోలేదని పేర్కొంటూ భవిష్యత్ ను దేవుడే నిర్ణయిస్తాడని ఆయన చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని నెహ్రూ వెల్లడించారు. ముక్కుసూటిగా ఉండే తత్వమే తనకు బలం - బలహీనత అని ఆయన చెప్పారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెబుతానని పేర్కొన్నారు.

నెహ్రూ పార్టీ మారే క్ర‌మంలో చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఇపుడు రాజ‌కీయంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ముందుగానే ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ద్వారా నెహ్రూ అసంతృఫ్తితో పార్టీ మారుతున్నార‌నే భావ‌న‌ను వైసీపీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే జ్యోతుల వ‌ర్గీయులు మాత్రం అదేమీ లేదంటూ కొట్టిపారేస్తున్నాయి.