Begin typing your search above and press return to search.

సింధియాకు షాకిచ్చిన కమల్‌ నాథ్

By:  Tupaki Desk   |   13 March 2020 12:16 PM GMT
సింధియాకు షాకిచ్చిన కమల్‌ నాథ్
X
మధ్యప్రదేశ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ప్రభుత్వాన్ని కష్టాల్లో పడేసి తన దారి తాను చూసుకున్న మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు... సర్కారు షాకిచ్చింది. గతంలో ఆయన మీద పెండింగ్‌ లో ఉన్న ఓ ఫోర్జరీ కేసును తిరగదోడింది. ఆ కేసులో వాస్తవాలు వెలికితీయాలని ఆర్థిక నేరాల విభాగం-ఈవోడబ్ల్యూని ఆదేశించింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో... రిజిస్ట్రేషన్‌ పేపర్లలో ఉన్నదానికంటే ఆరు వేల చదరపు అడుగులు తక్కువ ఉన్న భూమిని తనకు అమ్మారని సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి కేసు పెట్టాడు. 2014 మార్చి 26న ఈ కేసు నమోదైంది. 2018లో మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక - ఆ కేసులో విచారణను నిలిపివేశారు. తన అనుచరవర్గంతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ నుంచి వైదొలగడంతో - ఈ కేసును విచారించాలని శ్రీవాస్తవ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాస్తవాలను విచారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాజకీయ కుట్రని - కేవలం ప్రతీకారం కోసమే కేసును తిరిగదోడారని సింధియా వర్గం విమర్శలు గుప్పిస్తోంది. న్యాయం తమవైపే ఉందని, కమల్‌ నాథ్‌ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతామని అంటోంది. సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో - ప్రభుత్వ పతనం ఖాయమే. ఆ వెంటనే గవర్నర్‌ లాల్‌ జీ టాండన్‌ బీజేపీని ఆహ్వానించడం, వారికి సంఖ్యాబలం ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరగనున్న పరిణామాలు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక - ఎలాగూ సింధియాపై ఉన్న కేసు విచారణ నిలిచిపోతుంది కాబట్టి, నిలకడలేని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించినట్లన్న ప్రశ్నకు నిపుణులు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం పడిపోయేలోగా జ్యోతిరాదిత్య సింధియాను వీలైనంతగా ప్రజల్లో చెడుగా చూపించాలన్నదే కాంగ్రెస్ నేతల తాపత్రయమని విశ్లేషిస్తున్నారు.

పనిలోపనిగా - బల నిరూపణ కోసం కమల్‌ నాథ్‌ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కమల్‌ నాథ్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారంటూ మూడు పేజీల లేఖను గవర్నర్‌ కు అందించారు. వీటితో పాటు కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను సైతం గవర్నర్‌ కు వివరించినట్లు తెలుస్తోంది. బలపరీక్షకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. బెంగళూరు రిసార్టుల్లో ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే రాష్ట్రానికి వచ్చేలా జోక్యం చేసుకోవాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దాదాపు గంటపాటు ఇద్దరి మధ్య సమావేశం సాగింది.

ఓవైపు రాష్ట్రంలో పరిణామాలు ఇలా సాగుతుండగానే - జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బీజేపీ సీనియర్ నేత - మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరుండి సింధియా చేత నామినేషన్ వేయించారు. మధ్యప్రదేశ్‌ లో అసెంబ్లీలో బీజేపీకి తగినంత ఎమ్మెల్యేల బలం ఉన్నందున, సింధియా గెలుపు ఖాయమే.