Begin typing your search above and press return to search.

అదేంటి కేకేజీ.. ఒక వెర్షనే చెబితే ఎట్లా..?

By:  Tupaki Desk   |   29 Jun 2016 4:44 AM GMT
అదేంటి కేకేజీ.. ఒక వెర్షనే చెబితే ఎట్లా..?
X
మాటలు రాని మనిషిగా కనిపిస్తుంటారు టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు కేకే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మాటలు.. ఆయన హడావుడి ఒక రేంజ్ లో ఉండేవి. నిత్యం వార్తల్లో దర్శనమిచ్చేలా ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు. ఏ ముహుర్తంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారో కానీ.. మాటలు రాని మనిషిగా మారిపోయారు. కేసీఆర్ పక్కన సీటు దక్కినా.. కేవలం పక్కన కూర్చోవటం.. కేసీఆర్ మాటలకు తల ఊపటం మినహా మాట్లాడటం అన్నది చాలా అరుదన్నట్లుగా మారిపోయింది.

అలాంటి కేశవరావు తాజాగా నోరు విప్పారు. రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన 120 మంది జడ్జిలలో కొందరిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. జడ్జిలను సస్పెండ్ చేయటం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. జడ్జిలపై సస్పెన్షన్ వేటు వేసే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన.. జడ్జిల సస్పెన్షన్ ల్ని వ్యతిరేకిస్తూ మిగిలిన వారు సైతం సామూహిక రాజీనామాలు చేస్తారని వ్యాఖ్యానించారు.

హైకోర్టు విభజన.. జడ్జిల నియామకానికి సంబంధించిన అంశాల్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు.. కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో.. తాము కోరినట్లుగా సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో జడ్జిల మీద సస్పెన్షన్ వేటు వేయటం ఇదే తొలిసారి అంటూ చెప్పిన కేకే.. న్యాయం కావాలంటూ 120 మంది జడ్జిలు రోడ్డు మీదకు రావటం.. నిరసన తెలపటం లాంటివి కూడా దేశంలో ఇదే తొలిసారి అన్న మాటను చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విషయం చెప్పేటప్పుడు అన్నింటిని కవర్ చేయాలి కానీ.. ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా ఉండకూడదు కదా కేకే జీ?