Begin typing your search above and press return to search.

జనం డబ్బుతో కేంద్రం డప్పు

By:  Tupaki Desk   |   15 Dec 2021 8:32 AM GMT
జనం డబ్బుతో కేంద్రం డప్పు
X
ప్రజల డబ్బంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ అలుసే.. అందుకే విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తుంటాయి. దీనికి హద్దు... ‘పద్దు’ ఉండదు. దీనికి ఉదాహరణే.. వివిధ పథకాల ప్రచారం మీద అవి చేసే ఖర్చు. ఇది చాలాసార్లు శ్రుతి మించిన సంగతీ గుర్తుంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు 1994-2004 మధ్య సొంత డబ్బా కోసం రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించేవారు. దీనిపై పెద్ద చర్చనే లేవనెత్తారు. అయితే, 2004లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు సైతం ఇదే పంథాను అనుసరించిన సంగతి వేరే కథ. వైఎస్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి చేస్తున్న ఖర్చు పై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసేవారు. ఈ రెండుసార్లూ అయిన దానికి కాని దానికి ప్రచారం అనేదే ప్రధాన ఆరోపణ.

కేంద్ర ప్రభుత్వాలూ తక్కువ తినలేదు..

అతి ప్రచారంలో కేంద్ర ప్రభుత్వాలూ తక్కువ తినలేదు. యూపీఏ హయాంలో ప్రచారం ఎక్కువ గానే ఉన్నా..వరుస కుంభకోణాల రీత్యా అది మరుగున పడిపోయింది. ఇక ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్న గత ఏడున్నరేళ్లలో ఆర్భాటాలకు కొదవ లేదు. అసలే నరేంద్ర మోదీ ప్రచార ప్రియుడు. అలాంటి ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నాడంటే ఇక లోటేముంది. తన వేషధారణలోనే మోదీ గతంలో రకరకాల విమర్శలు ఎదుర్కోన్నారు.

ఏడాదికి అన్ని వేల కోట్లా?

కాగా, ఎన్డీఏ సర్కారు గత నాలుగేళ్లలో ప్రచారానికి రూ.8,504 కోట్లు వ్యయం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పత్రికలు, టీవీలు, ఇతర పద్ధతుల్లో ప్రకటనల రూపంలో ఈ మొత్తం ఖర్చు చేసినట్లు వివరించారు. 2017-18లో రూ.2,721 కోట్లు, 2018-19లో రూ.2,767 కోట్లు, 2019-20లో రూ.1,802 కోట్లు, 2020-21లో రూ.1,213 కోట్లు కేంద్రం ప్రచారానికి వ్యయం చేసిందని వివరించారు. తద్వారా నాలుగేళ్లలో ఏడాదికి సగటున రూ.2వేల కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.

కరోనా లేకుంటేనా..?రూ.10 వేల కోట్లు దాటేది

పై లెక్క చూస్తుంటే ఓ విషయం తెలుస్తోంది. కరోనాకు ముందు సంవత్సరాల్లో కేంద్రం ఏటా రూ.2,700 కోట్లు ప్రచారానికి ఖర్చుచేసింది. రెండేళ్లపాటు ఇదే స్థాయిలో ఖర్చులు ఉన్నాయి. అయితే, కొవిడ్ రాకతో దానికి కత్తెర పడింది. అప్పటికీ 2019-20లో రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ,కరోనా లాక్ డౌన్ లు ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావం ప్రకటనలపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ఏమీ లేకపోయింది. అందుకనే ప్రచార వ్యయం బాగా తగ్గింది.

కొసమెరుపు: గత కొన్నేళ్లలో ప్రభుత్వ ప్రకటనల ఖర్చు వివరాలను అడిగింది ఎవరో కాదు..? టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశరావు.