Begin typing your search above and press return to search.

కేకే పెదవి విప్పితే ఇంత పంచాయితీ అవుతుందా?

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:33 AM GMT
కేకే పెదవి విప్పితే ఇంత పంచాయితీ అవుతుందా?
X
నేనేం చేసినా అంతే.. చిరిగి.. చాటంతై.. అంత అవుతుందంటూ ఒక సినిమాలో కమెడియన్ పాత్రధారి చెప్పే డైలాగుకు తగ్గట్లే టీఆర్ఎస్ ఎంపీ.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెప్పే కేకే గురించి చెబుతుంటారు. గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. విషయం ఏదైనా కానీ ఆయన నోటి నుంచి మాట వస్తే చాలు.. అదో పెద్ద వార్తగా మారేది. తన మాటలతో తరచూ వార్తల్లో నిలిచే కేకే.. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక తన తీరు మొత్తాన్ని మార్చేశారని చెప్పాలి.

గతంలో మాట్లాడకుండా ఆయన ఉండలేరన్నట్లుగా ఆయన తీరు ఉండేది. తనకు అవసరం ఉన్నా.. లేకున్నా అదే పనిగా వ్యాఖ్యలు చేసే అలవాటును ఆయన పూర్తిగా మార్చేసుకున్నారు. అసలు కేకే అనే పెద్ద మనిషి మాట్లాడతారా? అన్న సందేహం కలిగేలా ఆయన ధోరణి ఉంటుంది. కేసీఆర్ పెట్టే కీలకమైన ప్రెస్ మీట్ కానీ..ముఖ్యమైన మీటింగ్ కానీ.. పార్టీ పరంగా సమావేశం కానీ.. కేసీఆర్ తన పక్కనే కూర్చోబెట్టుకునే ఒకరిద్దరు నేతల్లో కేకే ఒకరు.

ఏదైనా కీలక అంశానికి సంబంధించి బాధ్యత పెట్టాల్సి వస్తే.. కేకే మీద పెట్టేయటం.. ఆయన మౌనంగా ఓకే చెప్పటం కనిపిస్తుంది. అలాంటి ఆయన.. చాలా రోజుల తర్వాత తన పాత అలవాటు గుర్తుకు వచ్చేలా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే విషయంలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.

ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాలు సిద్ధం కావాలన్న ఆయన మాటకు.. ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా స్పందించినా.. ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా రియాక్షన్ అన్నది లేకపోవటం ఒక ఎత్తు అయితే.. సమ్మె ఎపిసోడ్ ను ఒక కొలిక్కి తెద్దామన్న ఉత్సాహాన్ని ప్రదర్శించిన కేకే.. తర్వాత మాత్రం పెదవి విరుస్తూ.. తన చేతుల్లో ఏమీ లేదనేయటం గమనార్హం. ఇంతకాలం పెదవి విప్పకుండా.. మనసులో ఏమున్నా మాట రూపంలో బయటకు రాకుండా జాగ్రత్త పడిన కేకే.. ఇంతకాలం వ్యవహరించిన తీరుకు భిన్నంగా వ్యవహరించిన తీరుపై సీఎం గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో అధినేతను తన మాటలతో కేకే ఇరుకున పడేశారన్న మాటతో పాటు.. పార్టీ మారాలనుకున్న వేళ.. ఇలాంటి పని చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.. పార్టీలో కొత్త కలకలాన్ని క్రియేట్ చేసింది. ప్రభుత్వానికి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండటానికి వీలుగా తాను ఒక అడుగు ముందుకు వేశానే తప్పించి.. తనకింకేమీ ఆలోచనల లేదని..పార్టీ మారే ఉద్దేశం అసలే లేదని స్పష్టం చేశారు. ఏమైనా.. మాట్లాడక మాట్లాడక మాట్లాడిన కేకే మాటలు ఎంత రచ్చ చేశాయో చూసినప్పుడు.. ఎప్పుడూ మాట్లాడని వ్యక్తి మాట్లాడితే ఇలా ఉంటుందా? అన్నది ఇప్పుడు మరో చర్చగా మారినట్లు తెలుస్తోంది.