Begin typing your search above and press return to search.

2019లో మోడీ కూడా చెల్లని నోటే

By:  Tupaki Desk   |   19 Nov 2016 2:41 PM GMT
2019లో మోడీ కూడా చెల్లని నోటే
X
కార్పోరేట్ వర్గాలకు ముందుగానే లీక్ చేసి సామాన్యులను ముప్ప తిప్పలు పెట్టేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన కరెన్సీ సర్టికల్ దాడి 2019 ఎన్నికల్లో ఆయనను చెల్లని నోటుగా మార్చడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హెచ్చరించారు. మోడీ రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగా పెద్దమొత్తంలో నల్లధనం నిల్వ చేసిన వారికి - వేల కోట్ల బ్యాంకులకు ఎగనామం పెట్టిన‌ పెట్టుబడిదారీ వర్గాలకు నష్టం చేకూరుతుందంటే సంతోషించేవారమని, కాని కేవలం సామాన్యులు మాత్రమే ఇబ్బందిపడుతున్నారన్నారు. బ్యాంకుల ముందు సంపన్నవర్గాలకు చెందిన ఒక్కరు కూడా నిలబడకపోవడమే ఇందుకు నిదర్శనమ‌ని నారాయ‌ణ‌ పేర్కొన్నారు. అలాగే దేశంలో సామాన్యులు వందల మంది మృతి చెందగా ఒక్క ధనవంతుడు కూడా చనిపోయిన దాఖలాలేదన్నారు. బిచ్చగాళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి వర్గాల వరకు రోజువారీ అవ‌స‌రాల‌కు డబ్బుల్లేక బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వివాహ - ఇతర వేడుకలను సైతం నిర్వహించడానికి డబ్బుల్లేక పేదలు నానా ఇక్కట్లకు గురి కాగా, అదే గాలి జనార్ధనరెడ్డి లాంటి వారు వందల కోట్ల వెచ్చించి తన కూతురు వివాహాన్ని అత్యంత ఆడంబరంగా సునాయసంగా నిర్వహించగలిగారంటే పెద్దనోట్ల రద్దు ప్రభావం ఎవరిపై తీవ్రంగా వుందో స్పష్టమవుతోందన్నారు.

దేశంలో 86శాతం కరెన్సీ పెద్దనోట్ల రూపంలో వుండగా - 14శాతం మాత్రమే చిన్న నోట్లు చెలామ‌ణి ఉన్న నేప‌థ్యంలో చిన్ననోట్ల ముద్రణ శాతం పెంచి - వాటిని పెద్దసంఖ్యలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తే ఇన్ని ఇబ్బందులుండేవి కావని నారాయ‌ణ చెప్పారు. కార్పోరేట్ వ‌ర్గాలకు ముందుగానే లీక్ చేసి వారి ప్రయోజనాలను కాపాడడంలో చూపిన ఆస‌క్తి సామాన్యుల విషయంలో లేకపోవడంతోనే మోడీ నైజం తేటతెల్లమవుతోందన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే మోడీ ఈ చర్యకు పాల్పడ్డారని, ఆ రాష్ట్రాల్లో ఓటమి పాలైతే ఆయన ప్రధానిగా కొనసాగే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. ప్రజలు ఎంత ఇబ్బందిపడినా మోడీకి అనవసరమని, మోడీ తన స్వార్థం కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్ప వుందని సెంటిమెంట్ తో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఒక ప‌క్క ఆయనే జనం ప్రాణాలు తీస్తుంటే ఆయనను ఎవరు చంపుతారని నారాయణ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీచే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

పెద్దనోట్ల రద్దు వల్ల కార్పోరేట్ల వ్యాపారాలకు ఎటువంటి ఆటంకం లేదని, చిన్న వ్యాపారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయని, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు రద్దు చేసిన వాటిస్థానంలో చెల్లని నోటుగా మిగిలిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహారం మరీ దారుణంగా వందన్నారు. మోడీ విధానాలను విమర్శించేవారందర్నీ దేశద్రోహులంటున్నారని, ఈ దేశంలో గాంధీని చంపిన ఆర్ ఎస్ ఎస్ వారికంటే దేశద్రోహులెవరున్నారో చెప్పాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చిలక్కొటుడుతోపాటు - సోది ఎక్కువైందన్నారు. చివరకు మీడియాను సైతం విసిగిస్తున్నారన్నారు. ఆడంబరాలకు డబ్బు విపరీతంగా దుబారా చేస్తున్నారని, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/