Begin typing your search above and press return to search.

బాబుకు జ‌గ‌న్ భ‌యం పట్టుకుందంట‌న్న కామ్రేడ్‌

By:  Tupaki Desk   |   6 March 2017 7:14 AM GMT
బాబుకు జ‌గ‌న్ భ‌యం పట్టుకుందంట‌న్న కామ్రేడ్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్ లేవ‌నెత్తారు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప‌నులు ఆయ‌న‌లో ఉన్న అభద్రతా భావాన్ని చాటి చెప్తున్నాయ‌ని అన్నారు. చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడే స్థాయికి చేరుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రానివ్వకుండా చంద్రబాబు నిషేధించారని తెలిపారు. ఇది అసెంబ్లీకి చీకటి ఘటన అని అన్నారు. "మొదటిసారిగా అమరావతిలో శాసనసభ ప్రారంభమవుతుండ‌టం చరిత్రలో లిఖించదగ్గ ఘటన అని చంద్రబాబు వర్ణించారు. అయితే దానితోపాటు శాసనసభ్యురాల్ని చారిత్రాత్మక అసెంబ్లీకి రానీయకుండా నిషేదించిన ఘటన కూడా చారిత్రాత్మకం అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు వెంట ఈ చారిత్రాత్మక చరిత్రలో నిలిచిపోతుంది." అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖలో నిర‌సనకు బయలుదేరిన వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్‌మోహనరెడ్డిని విశాఖ విమానాశ్రయంలోనే నిర్భందించడం ఏమిట‌ని నారాయ‌ణ ప్ర‌శ్నించారు. "జ‌గ‌న్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఒకవైపు ప్రతిపక్షమే లేకుండా బరితెగించి చేసే ప్రయత్నం, మరోవైపు రాజకీయ నిర్బంధకాండను అమలుచేస్తున్నారు. భూ నిర్వాసితుల సమస్యపై ఆందోళన చేస్తే, నిర్వాసితులను సంతృప్తిపరచకుండా ఆందోళనకారులను నిర్బందిస్తున్నారు. ఇసుక మాఫియా గ్యాంగుకు వ్యతిరేకంగా మహిళా రెవిన్యూ అధికారి నిలబడితే ఆమెను అభినందించాల్సిందిపోయి ఆమెకు చీవాట్లు పెట్టి మాఫియా శాసనసభ్యుడికి సలాం కొట్టారు. ప్రైవేట్ బస్సుల ఆగడాలకు హద్దే లేదు. వీరంతా అధికార ముసుగులో రవాణా మాఫియా పెత్తనం చేస్తున్నారు. ఇవ‌న్నీ భ‌యంతోనే బాబు చేస్తున్న ఘ‌ట‌న‌లు" అని విశ్లేషించారు. బస్సు ప్రమాద ఘటన సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి వ్యవహరించిన తీరు బాబు పార్టీ అసహనానికి నిదర్శనమని నారాయ‌ణ‌ పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా భయంతో, అభద్రతా భావంతో ఉన్నార‌ని నారాయ‌ణ విమ‌ర్శించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని, అందరికీ గులాబీ కండువా కప్పుతూ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలో చేరిన వారికి నిస్సిగ్గుగా మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉద్యమ సహచరుడు కోదండరామ్‌ ను కూడా భయంతోనే అరెస్ట్‌ చేయించారని పేర్కొన్నారు. వీళ్లిద్దరికీ గురువైన ప్రధాని మోడీ కూడా ప్రశ్నించిన రాజకీయ పార్టీలను, విద్యార్థుల్ని దేశద్రోహులుగా పేర్కొంటూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని నారాయ‌ణ విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/