Begin typing your search above and press return to search.

హోదా భారం దేవుడి మీదేసిన రాఘ‌వేంద్ర‌రావు !

By:  Tupaki Desk   |   9 April 2018 5:54 PM GMT
హోదా భారం దేవుడి మీదేసిన రాఘ‌వేంద్ర‌రావు !
X
ప్ర‌త్యేక హోదా పోరాటం న‌వ్యాంధ్ర‌లో రాజ‌కీయాన్ని హీటెక్కించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ఏపీలోని ప్ర‌జ‌లంతా త‌మ త‌మ రూపాల్లో హోదాకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌మ ఎంపీల‌తో రాజీనామాలు చేయించ‌డ‌మే కాకుండా నిరాహార దీక్ష‌కు దిగి ఉద్య‌మిస్తుంటే....అధికార టీడీపీ రిలే దీక్ష‌ల‌తో షో న‌డిపించేస్తోంది. ఇక కాంగ్రెస్‌ - వివిధ జేఏసీలు త‌మ త‌మ రీతుల్లో హోదా పోరుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. అయితే సినీ ప్ర‌ముఖుడు రాఘ‌వేంద్ర‌రావు మాత్రం కొత్త రీతిలో హోదాకోసం త‌న మ‌ద్ద‌తు ఇచ్చారు. అంతేకాదు...తాను చేసిన ప‌నికి హోదా వ‌చ్చేస్తుంద‌ని ధీమాగా చెప్తున్నారు. ఇంత‌కీ ఆయ‌నేం చేశారంటే...గ‌డ్డంతీసేశారు!

ఔను!గ‌డ్డం తీసేసి మ‌రీ ఆయ‌న హోదా కాంక్ష‌ను వెల్ల‌డించారు. అంతేకాదు త‌న చ‌ర్య వ‌ల్ల హోదా వ‌స్తుంద‌ని చెప్తున్నారు. ఆయ‌న ఎక్క‌డ గ‌డ్డం తీశారంటే... తిరుమ‌ల వెంక‌న్న స‌న్నిధిలో. రాఘ‌వేంద్ర‌రావు అంటే నిండైన గ‌డ్డంతో నిత్యం కనిపించే రూపం అనే సంగ‌తి తెలిసిందే. అయితే అలాంటి పెద్దాయ‌న తిరుమ‌ల స‌న్నిధికి చేరి త‌న గ‌డ్డం తీసేయించారు. ఇది ప్ర‌త్యేక హోదా కోసం చేసిన ప‌ని అని వివ‌రించారు. గ‌డ్డం తీసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌ను గ‌త కొన్నేళ్లుగా గ‌డ్డం తీసి కోరుకున్న ప్ర‌తి కోరికా నెర‌వేరుతోంద‌ని...ఏపీ ప్ర‌జ‌లు త్వ‌ర‌లో శుభ‌వార్త వింటారని తెలిపారు. వెంక‌న్న మీద విశ్వాసంతో తాను గ‌డ్డం తీసేశాన‌ని, త‌న కోరిక త‌ప్ప‌కుండా నెరవేరుతుంద‌ని రాఘ‌వేంద్ర రావు వివ‌రించారు.

అయితే ఓవైపు రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఉద్య‌మిస్తుంటే...రాఘ‌వేంద్ర‌రావుకు ఆప్తుడైన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం హోదాపై ఆశ‌లు పెట్టుకోని సంద‌ర్భంలో ఈ ద‌ర్శ‌క‌ప్ర‌ముఖుడు గ‌డ్డం తీసేయ‌డం వ‌ల్ల ఏపీకి హోదా త్వ‌ర‌లోనే ఎలా సాధ్య‌మ‌వుతుంద‌నేది చాలామందిలో క‌లుగుతున్న స‌హ‌జ‌మైన సందేహం. రాఘ‌వేంద్ర‌రావు అయినా అతి విశ్వాసం ఈ మాట చెప్పి ఉంటారా అనే అభిప్రాయాలు సైతం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న టీటీడీ చైర్మ‌న్‌కు సంబంధించి త‌న పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉండ‌టంపై మాత్రం ఆయ‌న సుతిమెత్త‌గా తిర‌స్క‌రించ‌డం ఆస‌క్తిక‌రం.