Begin typing your search above and press return to search.

స‌ద‌స్సుల పేరుతో బాబు చేసేదంతా ఊడిగ‌మే

By:  Tupaki Desk   |   29 Jan 2017 10:24 AM GMT
స‌ద‌స్సుల పేరుతో బాబు చేసేదంతా ఊడిగ‌మే
X
సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో విశాఖలో జరిగిన‌దంతా ఒట్టి బూటకమని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కె.రామకృష్ణ విమర్శించారు. గత ఏడాది జరిగిన సదస్సు తరువాత లక్షల కోట్లు పెట్టుబడులు ఎక్కడ వచ్చాయో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సామాజిక హక్కుల వేదిక ప్రజా చైతన్యయాత్ర విజయనగరంలో జరిగింది. ఈ సందర్భంగా కోట జంక్షన్‌ లో జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ ప్రసంగించారు. గతేడాది పెట్టుబడి దారుల భాగస్వామ్యంలో రాష్ట్రానికి 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు ప్రచారం చేశారని, అందులో కనీసం రూ.60 కోట్ల పెట్టుబడులైనా వచ్చాయా అని ప్రశ్నించారు. అది ప‌క్క‌న‌పెట్టేసి విశాఖలో తాజాగా మరో రూ.5లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందం జరిగిందని ప్రచారం చేస్తూ బూట‌క‌పు మాట‌లు చెప్తున్నార‌ని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు.

పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం చంద్ర‌బాబు మోసం చేస్తున్నార‌ని రామ‌కృష్ణ‌ ఆరోపించారు. స‌ద‌స్సుల పేరుతో కార్పోరేట్లకు సేవ చేస్తున్నారే త‌ప్ప ఎక్కడా కొత్త పరిశ్రమలు రాలేదని విమర్శించారు. పెట్టుబ‌డుల స‌ద‌స్సుల పేరుతో ఏపీ ప్ర‌జ‌ల దృష్టిని మ‌రల్చే మ‌త‌ల‌బుతో బాబు ముందుకు సాగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు డిమాండు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం చట్టబద్దత లేని ప్యాకేజీతో జనం చెవులో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో దళిత, మైనారిటీ భూములు కొల్లగొడుతున్నారని, అందుకు విశాఖలో జరిగిన 400ఎకరాల భూ కుంభకోణమే ఉదాహరణని అన్నారు. ఎక్క‌డ త‌న ప‌రిపాల‌న లోపాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు పెట్టుబ‌డుల హ‌డావుడి చేస్తున్నార‌ని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లపై ఉన్న ప్రేమ సామాన్య ప్ర‌జ‌ల అవ‌స్థ‌ల‌పై చంద్ర‌బాబు ఎందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/