Begin typing your search above and press return to search.

వరంగల్ ఉప ఎన్నిక కోసం బ్యాంక్ లోన్?

By:  Tupaki Desk   |   27 Oct 2015 11:15 AM IST
వరంగల్ ఉప ఎన్నిక కోసం బ్యాంక్ లోన్?
X
బ్యాంక్ లో రుణం తీసుకోవటం మామూలే. ఇంటి కోసమో.. చదువు కోసమే.. వ్యక్తిగత అవసరాల కోసమో రుణాలు తీసుకుంటుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా ఒక దరఖాస్తు వచ్చింది. త్వరలో జరిగే వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావిస్తున్నానని అయితే అందుకు అవసరమైన డబ్బు తన దగ్గర లేదని.. బ్యాంకు రుణం ఇవ్వాలంటూ హైదరాబాద్ వాసి ఒకరు కెనరా బ్యాంకుకు పెట్టుకున్నదరఖాస్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేటలోని బీఆర్ అంబేడ్కర్ నగర్ కు చెందిన 28 ఏళ్ల కె. వెంకట నారాయణ తాజాగా కెనరాబ్యాంక్ ను సంప్రదించాడు. తనకు వరంగల్ లోక్ సభా స్థానానికి జరిగే ఉఫ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నానని.. అయితే అందుకు అవసరమైన డబ్బులు లేని నేపథ్యంలో రూ.5లక్షలు ఎన్నికల రుణాన్ని ఇవ్వాలని కోరాడు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నారాయణ.. తాజాగా ఎన్నికల్లో పోటీ చేయటం కోసం బ్యాంక్ రుణం కోరటం చర్చగా మారింది. బ్యాంకు రూల్స్ ప్రకారం ఎన్నికల రుణం అంటూ ఇవ్వటం సాధ్యం కాదని.. అయినప్పటిక నారాయణ పెట్టుకున్న దరఖాస్తును ఉన్నతాధికారుల వద్దకు పంపినట్లుగా కెనరాబ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. స్వచ్ఛంద సంస్థను నిర్వహించే నారాయణ.. ఎన్నికల ద్వారా వచ్చే అధికారంతో పేదలకు మరింత సాయం చేయొచ్చన్న వాదనను వినిపిస్తున్నారు. మొత్తానికి విచిత్ర వైఖరితో తెరపైకి వచ్చిన నారాయణ లోన్ అప్లికేషన్ గురించి బ్యాంకు అధికారి ఒకరు మాట్లాడుతూ.. పర్సనల్ లోన్ కు నారాయణ అర్హుడే కానీ.. ఎన్నికల కోసం రుణం ఇవ్వటం కుదరని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. నారాయణ తన వాదనను వినిపిస్తూ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా కూడా రుణాలు ఇప్పించేలా నిబంధనలు మార్చాలని కోరుతున్నారు. చిత్రమైన వాదనతో మీడియాకు ఎక్కిన నారాయణ డిమాండ్ ఏదరికి చేరుతుందో చూడాలి.