Begin typing your search above and press return to search.

వామ్మో!... పాల్ నోట ట్రంప్‌ - ప‌వ‌న్‌ - నాదెండ్ల‌!

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:15 PM GMT
వామ్మో!... పాల్ నోట ట్రంప్‌ - ప‌వ‌న్‌ - నాదెండ్ల‌!
X
క్రైస్త‌వ మ‌త బోధ‌కుడిగా ప‌రిచ‌యం అయిన కేఏ పాల్‌... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హీట్ పెంచేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే ఎంత‌గా ఖ‌ర్చు పెట్టుకుని రాష్ట్రాన్ని చుట్టేస్తున్నా పాల్ న‌డుపుతున్న తంతు మొత్తం కామెడీగానే క‌నిపిస్తోంది త‌ప్పించి అందులో నుంచి సీరియ‌స్ నెస్ ఏ మాత్రం రావ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు అంశాల‌పై త‌న‌దైన సెటైరిక్ డైలాగులు సంధించి న‌వ్వులు పూయించిన పాల్‌... తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న‌తో మొద‌లైన పాల్ వ్యాఖ్య‌లు... ఆ త‌ర్వాత నాదెండ్ల భాస్క‌ర‌రావు - టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - ఆ త‌ర్వాత ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దాకా వెళ్లిపోయాయి.

ఈ వ‌రుస క్ర‌మంలోనే పాల్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో పాల్ పార్టీ ప్ర‌జా శాంతి పార్టీకి ఏకంగా 30 నుంచి 35 శాతం దాకా ఓట్లు ప‌డే అవ‌కాశాలున్నాయి. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌కు కేవలం 5 శాతం మాత్ర‌మే ఓట్లు ప‌డ‌తాయ‌ట‌. అయితే తాను ఒక్క ప‌వ‌న్ త‌ప్ప ఏ ఒక్క‌రితో పొత్తు పెట్టుకోలేద‌ని - ప‌వ‌న్ వ‌స్తే జ‌న‌సేన‌తో క‌లిసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జా శాంతి పార్టీ - జ‌న‌సేన క‌లిస్తే... త‌మ కూట‌మిదే విజ‌య‌మ‌ని చెప్పిన పాల్‌... త‌న పార్టీకి మెజారిటీ ఓటింగు ఉన్నా సీఎం పోస్టును మాత్రం ప‌వ‌న్‌కే వ‌దిలేస్తాన‌ని చెప్పారు. ఈ సారి ఏపీకి కాపుల నుంచే సీఎం రావాల‌ని తాను న‌మ్ముతున్నాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇక నాదెండ్ల భాస్క‌ర‌రావు ప్ర‌స్తావ‌న తెచ్చిన పాల్‌... ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని త‌న‌కు నాదెండ్ల‌నే సూచించార‌ని చెప్పారు. ఏపీకి సీఎంగా పాల్‌ అయితేనే బాగుంటుంద‌ని కూడా నాదెండ్ల అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌.

అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇప్ప‌టికే మూడేళ్లు దాటిపోతున్నా... ఇంకా భార‌త ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు రాలేద‌న్న విష‌యాన్ని పాల్ ప్ర‌స్తావించారు. భార‌త్‌కు రావ‌ద్ద‌ని ట్రంప్‌ను తానే చెప్పాన‌ని, త‌న మాట‌కు విలువ ఇచ్చే ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు ఇప్ప‌టిదాకా రాలేద‌ని పాల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్‌ను ఇండియాకు ప్ర‌త్యేకించి ఏపీకి తీసుకువ‌చ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు అనుమ‌తి ఇవ్వాల‌ని కూడా పాల్ కోరారు. కేవ‌లం మోదీ, చంద్ర‌బాబు అనుమ‌తి ప‌త్రాలు ఇస్తే... సింగిల్ పైసా కూడా ప్ర‌భుత్వ ఖ‌ర్చు లేకుండా ట్రంప్ ప‌ర్య‌ట‌న మొత్తం వ్య‌యాన్ని తానే భ‌రిస్తాన‌ని కూడా పాల్ త‌న‌దైన శైలిలో చెప్పుకుపోయారు. మొత్తంగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర నుంచి ఏకంగా ట్రంప్ దాకా ప‌లు అంశాల‌ను మాట్లాడేసిన పాల్... మ‌రోమారు కామెడీని పంచార‌ని చెప్పాలి.