Begin typing your search above and press return to search.

ట్రెండ్‌ మార్చిన కే.ఏ.పాల్‌ ..!

By:  Tupaki Desk   |   13 April 2019 4:45 AM GMT
ట్రెండ్‌ మార్చిన కే.ఏ.పాల్‌ ..!
X
కొన్ని ఉద్రిక్త సంఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పోరు ముగిసింది. ఇక ఫలితాల తరువాయే మిగిలింది. ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీలైన టీడీపీ - వైసీపీ - జనసేనలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్‌ ఈ ఎన్నికల్లో చేసిన హడావుడి - సీరియస్ కామెడీ అంతా ఇంతా కాదు. టీడీపీ - వైసీపీలతో పాటు ఇతర పార్టీలను ఒకవైపు వినూత్నంగా విమర్శిస్తూ.. మరోవైపు నవ్వులు పూయించాడు. ఫ్లైయింగ్‌ కిస్సులు - గాల్లో ఎక్సర్‌ సైజ్‌ లు చేస్తూ కామెడీ పంట పండించారు. మరోవైపు తమ పార్టీ తరుపున అభ్యర్థులను ప్రకటించిన పాల్‌ నేనే సీఎం అంటూ ప్రచారం చేయసాగారు. అయితే ఎన్నికలు ముగిశాక పాల్‌ కామెడీ నుంచి సీరియస్‌ గా మారారు. ఇప్పుడు ఆయన కామెడీ చేయడం లేదు. సీరియస్‌ గా ఓ నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే..

ఎన్నికల పోరు ముగిసిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు - వైసీపీ అధినేత జగన్‌ మీడియా ముందుకు వచ్చారు. విజయం తమదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్‌ లో జరిగిన ఉద్రిక్తలపై ఇరు నేతలు స్పందించారు. ఫ్యాక్షన్‌ గొడవలకు చంద్రబాబే కారణమంటూ జగన్‌ - గొడవలను జగన్‌ పెంచిపోషిస్తున్నాడని టీడీపీ అధినేత ఆరోపించారు. చివరగా ఎవరికి వారే గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎన్నికల సమయంలో మిగతా నాయకుల కంటే ఎక్కువగా మీడియా ద్వారా పాపులర్ పొందిన కే.ఏ.పాల్‌ ఎన్నికల తరువాత కనిపించడం లేదనే వార్తలు వచ్చాయి. మీడియా మందు గంటల కొద్దీ సమావేశాలు నిర్వహించే పాల్‌ ఆ తరువాత సైలెంట్‌ అయిపోయరని ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఆయనలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని సోషల్‌ మీడియాలో పోస్టుల పరంపర సాగింది.

ఈ విమర్శలను గ్రహించిన పాల్‌ నిన్న రాత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ సీరియస్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని - ఈ అక్రమాలపై యుద్ధం చేయాలని ప్రకటించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మోడీ జగన్ ను గెలిపిస్తున్నారని.. ఏపీ సీఎం జగన్ అని కన్ఫం చేశారు. దీనికి నిరసనగా విజయవాడనే వేదికగా చేసుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఎన్నికల్లో జరిగిన అవినీతిపై నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ దీక్షకు ప్రజలంతా కలిసిరావాలని కోరారు.

ఈవీఎంల మొరాయింపుపై టీడీపీ అధినేత ఈసీని కలిసివచ్చారు. అదే బాటలో పాల్‌ కూడా ఈసీని కలవడానికి వెళ్లారు. కానీ అక్కడున్న సిబ్బంది అనుమతి లేదని చెప్పడంతో ఈసీ తీరుపై ఆయన మండిపడ్డారు. ఇది కూడా ధర్నా చేయడానికి కారణమైందని చెబుతున్నారు. అంటే పాల్‌ ఇక కామెడీ చేయకుండా సీరియస్‌గా కార్యక్రమాలు నిర్వహించనున్నాడట. చూడాలి మరి పాల్ సీరియస్ ఎంత వరకు పనిచేస్తుందో..