Begin typing your search above and press return to search.

కేఏ పాల్ పార్టీ టికెట్‌ కు కండిష‌న్ ఏమిటో చెప్పారు

By:  Tupaki Desk   |   12 Jan 2019 7:39 AM GMT
కేఏ పాల్ పార్టీ టికెట్‌ కు కండిష‌న్ ఏమిటో చెప్పారు
X
ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు మ‌రో హ‌డావుడి మొద‌లైంది. త‌న మాట‌ల‌కు తానే కౌంట‌ర్లు ఇచ్చుకునే విచిత్ర‌మైన వ్య‌క్తిత్వం కేఏ పాల్ సొంతం. ఒక‌ప్పుడు ఈ పెద్ద‌మ‌నిషి మ‌త ప్ర‌చార‌కుడిగా వ‌స్తున్నారంటే చాలు.. హ‌డావుడి ఒక స్థాయిలో ఉండేది. తాను చేయాల్సిన ప‌నిని ప‌క్క‌న పెట్టి రాజ‌కీయాలంటూ మొద‌లెట్టిన నాటి నుంచి కేఏ పాల్ గ్రాఫ్ ఎలా సాగిందో అంద‌రికి తెలిసిందే.

నోరు విప్పితే అంత‌ర్జాతీయ స్థాయిని ఏ మాత్రం త‌గ్గ‌ని కేఏ పాల్.. తెలుగు ప్ర‌జ‌ల‌కు త‌న మాట‌ల‌తో షాకుల మీద షాకులు ఇవ్వ‌టం అల‌వాటే. మొన్న‌టికి మొన్న ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి తానేన‌ని చెప్పేసిన పాల్‌.. తాను సీఎంను అయితే త‌న స‌ల‌హాదారుగా చంద్ర‌బాబును పెట్టుకుంటాన‌ని చెప్పారు. అదే పెద్ద మ‌నిషి రోజు గ‌డిచేస‌రికి బాబును ఓడించ‌ట‌మే త‌న ధ్యేయ‌మ‌ని బ‌ల్ల గుద్ది చెబుతున్నారు.

ఆరాచ‌క పాల‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన టీడీపీని భూస్థాపితం చేయ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పే కేఏ పాల్‌.. త‌న శ‌త్రువుల లిస్ట్‌ను విప్పారు. అందులో ప్ర‌ధాని మోడీ పేరు కూడా ఉంది. ఇంత‌కీ మోడీ మీదా.. చంద్ర‌బాబు మీద ఆయ‌న‌కు అంత కోపం.. క‌సి ఎందుకన్న విష‌యాన్ని మ‌న‌సులో దాచుకోకుండా చెప్పేశారు. 2014 ముందు త‌న సంస్థ‌కు రావాల్సిన విదేశీ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ఆపింద‌ని.. ఆ టైంలో బీజేపీ త‌న‌కు హామీ ఇచ్చింద‌న్నారు.

తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే నిధుల్ని అందిస్తామ‌ని చెప్పింద‌ని.. కానీ ఆ ప‌ని చేయ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహానికి మోడీ పాల్ప‌డ్డార‌న్నారు. మోడీ ఒక్క‌రే కాదు.. టీడీపీ కూడా త‌న‌ను చాలా ఇబ్బందులు పెట్టింద‌న్నారు.

అందుకే న‌మ్మ‌క‌ద్రోహులైన మోడీ.. బాబుల‌కు చెందిన పార్టీల‌ను ఓడించ‌ట‌మే త‌న ధ్యేయంగా చెప్పుకున్నారు. మ‌రి.. పార్టీ గెల‌వాలంటే బ‌రిలోకి దిగి.. ప్ర‌ధాన పార్టీల‌కు ముచ్చ‌మ‌ట‌లు పోయించే అభ్య‌ర్థులు కావాలిగా. దానికీ.. ఓ ప్లాన్ వేసేశారు పాల్ గారు. మీకు మా విశ్వ‌శాంతి పార్టీ టికెట్ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌నుకుంటున్నారా..? అందుకు సింపుల్ ప‌ని ఒక‌టి చేస్తే స‌రిపోతుందంటూ సెల‌విస్తున్నారు.

చెప్పినంత సింఫుల్ గా ఉంటే ఆయ‌న కేఏ పాల్ ఎందుక‌వుతారు చెప్పండి. ప‌దివేల మంది క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల్ని పార్టీలో చేర్పిస్తే వారికి టికెట్ గ్యారెంటీ అని అభ‌య‌మిస్తున్నారు. కామెడీ కాక‌పోతే.. అంత మందిని పార్టీలో చేర్పించే స‌త్తా ఉన్న నేత పోయి.. పోయి పాల్ పార్టీలో ఎందుకు చేర‌తారు? మాట‌ల్లోనే అనంత విశ్వాన్ని.. అందులోని బ‌డా నాయ‌కులంతా త‌న జేబుమ‌నుషులుగా చెప్పే పాల్ కు.. ఇలాంటివి చాలా చిన్న విష‌యాలే. పార్టీ రెఢీ.. పార్టీ అధినేత రెఢీ. మ‌రి.. పాల్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌టానికి అభ్య‌ర్థుల ఎంత‌మంది రెఢీగా ఉన్నారో చూడాలి. చివ‌ర‌గా చిన్న మాట‌. తానే.. కాబోయే ముఖ్య‌మంత్రిన‌ని నొక్కి వ‌క్కాణిస్తున్న పాల్.. అదే మాట‌ను త‌న ప్రెస్ మీట్ లో నిమిషానికి వంద సార్లు చందంగా చెప్ప‌టం క‌నిపించింది. కాబోయే ముఖ్య‌మంత్రిని తాను మాత్ర‌మేన‌ని పాల్ ఎంత న‌మ్మితే మాత్రం.. పాత్రికేయుల‌కు త‌న మాట‌ల‌తో చుక్క‌లు చూపించుడేమిటో?