Begin typing your search above and press return to search.

మునుగోడులో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న కేఏ పాల్

By:  Tupaki Desk   |   28 Oct 2022 10:32 AM GMT
మునుగోడులో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న కేఏ పాల్
X
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేడిలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ మత ప్రబోధకుడు కేఏ పాల్ చేసిన సీరియస్ కామెడీ అందరినీ సేదతీర్చింది. ఆయన ఏపీ ఎన్నికల్లో పోటీచేసి చేసిన కామెడీ ప్రచారం అందరికీ నవ్వులు తెప్పించింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడంతో పెట్టాబేడా సర్దుకొని అమెరికా వెళ్లిపోయాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల వేళ మళ్లీ కేఏ పాల్ బయటకు వచ్చాడు.

ఈ ఎన్నికల్లో నిలబడి మునుగోడులో వినూత్న, వింత వింత ప్రచారాలతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నాడు. మునుగోడులో ఏమాత్రం తగ్గకుండా కేఏ పాల్ చేస్తున్న రచ్చ అందరినీ ఆకట్టుకుంటోంది. మునుగోడులో గెలిచేది నేనే అంటూ కేఏ పాల్ చేస్తున్న ప్రచారం రియల్ కామెడీని తలపిస్తోంది.

మునుగోడు ప్రచారంలో హోటల్స్ లో దోశలు వేస్తూ.. పాటలకు డ్యాన్సులు చేస్తూ కేఏ పాల్ రచ్చ చేస్తున్నారు. ఇక తనకు తారసపడిన ఇతర పార్టీల అభ్యర్థులను సైతం తనకే ఓటు వేయాలని కోరుతూ షాకిస్తున్నాడు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రచారానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డికి ఒక విన్నపాన్ని కేఏ పాల్ చేశాడు. ‘తనకు మద్దతు ను ఇవ్వాలని.. మునుగోడులో గెలిపిస్తే 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేస్తానని .. మునుగోడును అమెరికా చేస్తానని’ కోరారు. దీనికి నవ్వి ఊరుకోవడం రాజగోపాల్ రెడ్డి వంతైంది.

కేఏ పాల్ అయితే అన్నీ మరిచిపోయి ఐటెం గర్ల్ లా ఏకంగా నడిరోడ్డుమీద రికార్డింగ్ డ్యాన్స్ చేసిపడేశారు. తాజాగా రైతు వేషధారణలోకి కేఏ పాల్ మారిపోయాడు. తలకు కండువా కట్టుకొని రైతులా చేతిలో కర్ర పట్టుకొని రైతులతో కలిసి పత్తిచేనులో దిగి పనిచేస్తూ వారితో ముచ్చటించాడు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన మాటలతో నవ్వించాడు. రైతు సమస్యలను పరిష్కరిస్తానని.. కేసీఆర్ కు ఓటు వేయవద్దని.. కాంగ్రెస్, బీజేపీలో చేసేది ఏమీలేదని.. ప్రజలంతా ధర్మం వైపు ఉంటున్న తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడులో తనను గెలిపిస్తే అమెరికాలా అభివృద్ధి చేస్తానన్నారు. యువతకు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు.

ఇన్ని వేషాలు వేస్తూ.. అందరికంటే భిన్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్న పాల్ కు మరి ఏ మాత్రం ఓట్లు పడుతాయో చూడాలి. ఏపీలో ఇవన్నీ చేసినా కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. మరి మునుగోడులో ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.