Begin typing your search above and press return to search.

కాపు ప్లస్ కమ్మ...పవర్ ఫుల్లేనా.. ?

By:  Tupaki Desk   |   1 Oct 2021 7:32 AM GMT
కాపు ప్లస్ కమ్మ...పవర్ ఫుల్లేనా.. ?
X
ఏపీ రాజకీయాల్లో కులాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరూ కూడా కులాలను దాటి రాజకీయాలు చేయలేరు. కులమే గెలుపునకు ఆలంబనగా మార్చుకుంటారు. ఓట్ల లెక్కలు కూడా అలాగే ఉంటాయి. ఎవరు బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా కులాల వలయం నుంచి తేలిగ్గా బయటకు రాలేరు. కులం కూడు పెడుతుందా అని పెద్దలు అంటారు కానీ కులం ఓట్లు తెచ్చిపెడుతుంది. అంతే కాదు అధికారాన్ని కూడా కట్టబెడుతుంది. అందుకే కులం నామస్మరణం చేయకుండా రాజకీయ పార్టీలకు పొద్దు గడవదు. ఇదిలా ఉంటే ఏపీలో కులాల గొడవలలో ఇప్పటిదాకా దిగని పవన్ కళ్యాణ్ ఇపుడు రూట్ మార్చాను అంటున్నారు. సరికొత్త రాజకీయం చేస్తాను అని కూడా చెబుతున్నారు. ఆయన దృష్టిలో ఇపుడు వైసీపీ బాధిత కులాలు చాలానే ఉన్నాయి. అందులో అగ్ర భాగాన్ని కమ్మ కులానికి ఇచ్చారు. కమ్మలు వైసీపీకి వర్గ శత్రువులు అంటూ పవన్ ఇచ్చిన సరికొత్త డెఫినిషన్ చాలా మంది రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనల్లో పడవేస్తోంది.

కమ్మవారు ఆశ్రితులు కాదు, బాధితులు అంతకంటే కాదు, వారు కేవలం రెండున్నరేళ్ల క్రితమే అధికారాన్ని కోల్పోయారు. అంతే కాదు వారికంటూ ఒక రాజకీయ అస్థిత్వం ఉంది. తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక కమ్మ వారి రాజకీయ దూకుడు కూడా అంతే స్థాయిలో పెరిగింది. కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని దశాబ్దాల పాటు పాలించిన రోజుల్లో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలలో కమ్మ వారున్నారు. మరో వైపు తొలినాళ్ళలో కమ్యూనిస్టు పార్టీలో కూడా వారే ఉన్నారు. అంతే కాదు ఒక దశలో కాంగ్రెస్ కి ధీటుగా కమ్యూనిస్టు పార్టీలు ఎదగడం వెనక కమ్మ వారి రాజకీయ నైపుణ్యం కూడా ఉంది. ఇక 1982 తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే కమ్మ వారికి బలమైన అండ దొరికినట్లుగా అయింది. ఆ పార్టీ ద్వారా వారు ఫ్రంట్ లైన్ లోకి వచ్చి రాజకీయ అవకాశాలు అన్నీ బాగానే దక్కించుకున్నారు. ఇక చంద్రబాబు జమానాలో కూడా మరింతగా విస్తరించారు. ఇవన్నీ ఎందుకు 2019 ఎన్నికల వేళ వైసీపీ చేసిన ఆరోపణ ఒక్కటే. అన్నింటా ఒకే కులానికి టీడీపీ పెద్ద పీట వేసిందని. దాన్ని జనాలు నమ్మారు కాబట్టే టీడీపీని ఓడించారు.

ఇపుడు కమ్మ వారు అన్నింటా అణగారిపోతున్నారు అని తెలుగుదేశంలోనే ఎవరూ అనడంలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెగ బాధపడుతున్నారు. వారిని పూర్తిగా ఏపీలో ఉండకుండా వైసీపీ రాజకీయం చేస్తోంది అని కూడా జాలి పడుతున్నారు. పవన్ తెచ్చిన మరో కొత్త పోలిక ఏంటి అంటే కమ్మ వారిని కాశ్మీర్ పండింట్లతో పోల్చడం. కాశ్మీర్ పండిట్లను అక్కడ రాజకీయ, సామాజిక పరిస్థితులు వెలి వేసి వెళ్లగొట్టాయి. వారు అప్పటిదాకా కాశ్మీర్ లో రాజకీయంగా కూడా కీలకంగా లేరు. అలాంటి వారితో కమ్మలను పోల్చడం అంటే నిజంగా అతి అయిందనే చెప్పాలి.

ఇదంతా పవన్ ఎందుకు చేస్తున్నారు అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే పవన్ కమ్మ వారి మీద ప్రత్యేక ప్రేమను చూపించడం వెనక కూడా రాజకీయ సమీకరణలు చాలానే ఉన్నాయని అనుకోవాలి. ఏపీలో రాజకీయం రెడ్లు, కమ్మలుగా విడిపోయింది. రెడ్లు గతంలో కాంగ్రెస్ తరువాత వైసీపీని సమర్ధిస్తూ వస్తున్నారు. కమ్మలు అయితే తెలుగుదేశానికి ఆయువు పట్టుగా ఉన్నారు. అయితే తెలుగుదేశం 2019 ఎన్నికల్లో ఓడాక కమ్మలలో రాజకీయపరమైన అభద్రతాభావం ఏర్పడింది అన్నది నిజం. చంద్రబాబుకు వయసు అయిపోవడం, కుమారుడు, రాజకీయ వారసుడు లోకేష్ పట్ల పెద్దగా నమ్మకాలు లేకపోవడం వల్ల కమ్మలు ఇపుడు దిగాలుగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వారు తమ ఆశలను జూనియర్ ఎన్టీయార్ మీద పెట్టుకున్నారు. అయితే జూనియర్ సినిమాలు వదిలి ఇప్పటికిపుడు రాజకీయాల్లోకి రారు, రాలేరు. ఈ నేపధ్యంలో అదే సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ వంటి చరిష్మాటిక్ హీరో కమ్మలను తన వైపు రమ్మని ఆహ్వానిస్తున్నాడు.


కమ్మలు కనుక జనసేన వైపు వస్తే ఏపీలో రాజకీయం మారుతుంది అని పవన్ ఆశ. ఎటూ కాపులలో తనకు మెజారిటీ మద్దతు ఉంటుందని ఊహిస్తున్న పవన్ కమ్మలను దగ్గర చేర్చుకుంటే ఏపీ రాజకీయాల్లో బలమైన ఫోర్స్ గా మారవ‌చ్చు అని ఆశిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పలుమార్లు అధికారంలోకి రావడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడింది. అందుకే పవన్ ఈ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ నకు పూనుకుంటున్నారు అనుకోవాలి. కానీ ఏపీలో సామాజిక పరిస్థిలు చూస్తే అంత ఈ రెండు కులాలు పూర్తి స్థాయిలో కలిసేందుకు అనుకూలంగా లేవు అనే చెప్పాలి. కమ్మలకు కాపులకు మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతారు. ఇక కాపులు తమకు రాజకీయ ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నారు. వారు కూడా రెడ్లు, కమ్మలతో సరిసమానంగా తమకంటూ సొంత రాజకీయ అస్థిత్వం కావాలని పరితపిస్తున్నారు. మరి పవన్ కమ్మలను పొగుడుతూ వారిని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కమ్మలు, కాపులు కలిస్తే మాత్రం ఏపీలో వైసీపీని ఢీ కొట్టే బలమైన పొలిటికల్ ఫోర్స్ తయారు కావడం ఖాయం. మరి ఆ విధంగా పవన్ రచించిన మాస్టర్ ఫలిస్తుందా. పవన్ కమ్మలను తన వైపు ఆకట్టుకుంటే టీడీపీ చూస్తూ ఊరుకుంటుందా. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే.