Begin typing your search above and press return to search.

హెల్త్ జాగ్ర‌త్త ! : క‌డ‌ప రిమ్స్ పై క‌న్నేయండి రజ‌నీ!

By:  Tupaki Desk   |   13 April 2022 8:05 AM GMT
హెల్త్ జాగ్ర‌త్త ! : క‌డ‌ప రిమ్స్ పై క‌న్నేయండి రజ‌నీ!
X
ఆరోగ్య రంగంలో ఆశించిన మార్పులు రావాలి అని యువ ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌మ‌యిన ఆదేశాలు నిన్న‌టి వేళ ఇచ్చారు. కానీ క‌నీస స్థాయిలో నిధులు లేకుండా తాము ఎలా ప‌నిచేసేది అని క‌డప రిమ్స్ అధికారులే ప్ర‌శ్నిస్తున్న దాఖ‌లాలు ఉన్నాయి. క‌నీసం అత్యవ‌స‌ర విభాగాల‌కు సైతం కోత‌లు లేకుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం పై లేదా అని విప‌క్ష పార్టీలు గ‌ళం వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా బాధ్య‌త‌లు అందుకున్న మంత్రి విడ‌ద‌ల రజ‌నీ త‌క్ష‌ణమే ప‌రిష్కార మార్గాలు వెత‌కాల్సి ఉంది. ఇప్ప‌టికే చాలా చోట్ల ఊపిరి అంద‌క వెంటిలేట‌ర్లు ప‌నిచేయ‌క అవ‌స్థ‌లు ప‌డుతున్న రోగులున్నారు. అత్య‌వస‌రం అనుకునే విభాగాల‌కు విద్యుత్ కు సంబంధించి కనీస స్థాయిలో సౌక‌ర్యాలు లేవు. జిల్లా కేంద్రాస్ప‌త్రులే కాదు చాలా గ్రామీణాస్ప‌త్రులు కూడా కొవ్వొత్తుల వెలుగులోనే కీల‌క శ‌స్త్ర చికిత్స‌లు కూడా చేస్తున్నాయి. క‌నుక అత్యస‌రం అనుకున్న విభాగాల‌కు ముందుగా జ‌న‌రేట‌ర్లు స‌మ‌కూర్చాలి.

అదేవిధంగా అత్య‌వ‌స‌రం అనుకున్న విభాగాల‌కు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని రావాలి. వీటితో పాటు చాలా ఆస్ప‌త్రుల్లో క‌నీస స్థాయిలో కూడా మందులు కొనుగోలు అన్న‌ది లేదు. క‌నుక దీనిపై కూడా మంత్రి ర‌జ‌నీ దృష్టి సారించాలి. బోధ‌నాస్ప‌త్రులున్నా కూడా అక్క‌డ కూడా సిబ్బంది కొర‌త క‌నిపిస్తోంది.ఈ స‌మ‌స్య అధిగ‌మించేందుకు సిబ్బంది నియామ‌కానికి (బోధ‌న మ‌రియు బోధ‌నేత‌ర సిబ్బంది) సీఎం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినందున వెనువెంట‌నే సంబంధిత నోటిఫికేష‌న్ జారీ చేసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంది. మే నెలాఖ‌రు నాటికి ఖాళీగా ఉన్న 39 వేల పోస్టుల భ‌ర్తీకి సీఎం సుముఖ‌త వ్య‌క్తం చేసినందున వీలున్నంత మేరకు వేగంగానే సంబంధిత ప్ర‌క్రియ‌య చేప‌డితే ప్ర‌భుత్వాస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌పై గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెర‌గ‌డ‌మే కాదు మేలిమి వైద్యం పేద‌ల‌కు అందేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

వైద్యారోగ్య శాఖ‌కు సంబంధించి ఇప్పుడు కొత్త మాట‌లు వినిపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా నిన్న‌నే ఈ శాఖ‌కు సంబంధించి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించి త‌న వంతు ఏం చేయ‌గ‌ల‌నో చెప్పారు. ముఖ్యంగా 16 వేల కోట్ల రూపాయ‌ల‌తో నాడు - నేడు త‌రహాలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు వెచ్చిస్తామ‌ని చెప్పారు.దీంతో మారుమూల ప్రాంతాల‌లో ఉన్న ఆస్ప‌త్రుల‌కూ కొత్త శోభ ద‌క్క‌నుంద‌న్న ఆశావాదం ఒక‌టి స్ప‌ష్టంగా వినిపిస్తోంది. 16 కొత్త మెడిక‌ల్ కాలేజీలతో స‌హా పీహెచ్సీల ఆధునికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నా జిల్లాల‌లో ఆస్ప‌త్రుల ప‌రిస్థితిపై స‌మీక్ష ఎప్పుడు చేప‌డ‌తారు అన్న‌ది విప‌క్షం ప్ర‌శ్న.

ముఖ్యంగా ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప రిమ్స్ లో చిన్నారుల అవ‌స్థ‌ల గురించి ఇటీవ‌లే వార్త‌లు వెలుగు చూశాయి. ఆస్ప‌త్రికి సంబంధించి అత్య‌వ‌స‌ర విభాగానికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో (అప్ర‌క‌టిత కోత‌ల కార‌ణంగా) ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘ‌ట‌న మ‌రువ‌లేం. దీనిపై కొత్త‌గా బాధ్య‌త‌లు అందుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో అన్ని చోట్లా విద్యుత్ కోత‌ల కార‌ణంగా క‌నీసం ఇన్వ‌ర్ట‌ర్లు కూడా ప‌నిచేయ‌క అవ‌స్థ‌లు ప‌డుతున్న ఆస్ప‌త్రుల‌కు ప్ర‌త్యామ్నాయ సౌక‌ర్యాలు క‌ల్పించాలి.

ఉన్న జ‌న‌రేట‌ర్లు మ‌ర‌మ్మ‌తులు కార‌ణంగా మూల‌కు చేరుకోవ‌డంతో వాటి స్థానంలో కొత్త‌వి కొనుగోలు చేయ‌లేక, వీటిని వినియోగించ‌లేక చాలా జిల్లా ఆస్ప‌త్రులు అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి.ఈ నేపథ్యంలో కొత్త వైద్యారోగ్య శాఖ మంత్రి అన్ని జిల్లా కేంద్రాస్ప‌త్రుల నిర్వాహ‌కుల‌తో ఒక్క‌సారి మాట్లాడి క్షేత్ర స్థాయిలో కోత‌ల కార‌ణంగా త‌లెత్తుతున్న ఇబ్బందులు తెలుసుకోవాల్సిన బాధ్య‌త ఎంతైనా ఉంది.