Begin typing your search above and press return to search.

గంటా రాజకీయానికి షాకవుతున్న కడప టీడీపీ

By:  Tupaki Desk   |   1 Jan 2016 11:02 AM GMT
గంటా రాజకీయానికి షాకవుతున్న కడప టీడీపీ
X
రాజకీయ సుడిగాడుగా చెప్పుకొనే గంటా శ్రీనివాసరావు నిత్యం అధికార పార్టీల్లోనే ఉంటారు. ఆయన అడుగుపెట్టిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదంటే అధికారంలోకి రావడం గ్యారంటీ అని అంచనావేసి ఆయన అడుగుపెడతారో తెలియదు కానీ, ఆయన ఏ పార్టీలోకి మారితే ఆ పార్టీకి అధికారం దక్కుతుంది. ఇలా నిత్యం అధికార పార్టీలో ఉంటూ ఆయన సక్సెస్ ఫుల్ నేతగా సాగిపోతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న ఆయన మొన్న ఎన్నికలకు ముందు టీడీపీలోకి మారి మళ్లీ మంత్రయ్యారు. అయితే... టీడీపీలో చింతకాయల అయ్యన్నపాత్రుడితో వైరం కారణంగా ఇబ్బంది పడుతున్న ఆయన్ను మరింత ఇబ్బందిపెట్టడానికి అయ్యన్న పాత్రుడు తనకు తోడుగా కొణతాల రామకృష్ణనూ టీడీపీలోకి తెచ్చే ప్రయత్నాలు చేయడంతో గంటా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.... కొణతాలను వ్యతిరేకిస్తున్న గంటా మిగతా జిల్లాల్లో మాత్రం చేరికలను తెగ ప్రోత్సహిస్తున్నారట. దీంతో ఈయన మామూలు రాజకీయనాయకుడు కాదు అంటున్నారు టీడీపీ నేతలు.

గంటా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఒకలా వేరే జిల్లాలో మరోలా వలసల విషయంలో వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు - మంత్రి అయ్యన్నపాత్రుడు కొణతాల కోసం ప్రయత్నిస్తుంటే గంటా మాత్రం అడ్డుపడుతూనే ఉన్నారు. కొణతాల చేరికకు వ్యతిరేకంగా జిల్లా నేతలను వెనకుండి గంటా ఎగదోస్తున్నారని చెబుతున్నారు. కొణతాల వస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని లోకల్ లీడర్లు తీర్మానాలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. దీనంతటికి మంత్రి గంటాయే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇదే గంటా శ్రీనివాస్ కడప జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లాకు ఇన్‌ చార్జ్ మంత్రిగా ఉన్న గంటా … జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చే విషయంలో ముందుండి చర్చలు జరుపుతున్నారు. ఆది వస్తే పార్టీ బలపడుతుందంటూ దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డితో శత్రుత్వం ఉన్న రామసుబ్బారెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తీరుపై జమ్మలమడుగు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సొంత జిల్లాలో మాత్రం వలసలు వద్దనే గంటా.. కడప జిల్లాకు వచ్చే సరికి మాత్రం పార్టీ బలోపేతమంటూ నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొణతాలతో గంటాకు మరీ తీవ్రమైన వైరం కూడా లేదని అలాంటి చోటే వలస వద్దని చెప్పే గంటా దశాబ్దాలుగా తీవ్ర పోరుకు వేదికైన జమ్మలమడుగులో మాత్రం ఆదినారాయణరెడ్డి పార్టీలోకి తీసుకురావాలని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. గంటాకో న్యాయం.. మిగతావారికో న్యాయమా అని రామసుబ్బారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.