Begin typing your search above and press return to search.

జగన్ పార్టీపై సొంత మామ ఆరోపణలు

By:  Tupaki Desk   |   22 March 2016 6:19 AM GMT
జగన్ పార్టీపై సొంత మామ ఆరోపణలు
X
వైసీపీ అధినేత జగన్ ను ఆయన సమీప బంధువే వదిలివెళ్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా మేనత్త కొడుకైన పీటర్ ఇంతకాలం వైసీపీలోనే ఉండేవారు. తాజాగా ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే... టీడీపీలో చేరిక సందర్భంగా పీటర్ వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. కడపలో 23వ వార్డు నుంచి కార్పొరేటర్ గా గెలిచిన ఆయన అప్పట్లో డిప్యూటీ మేయర్ పదవి కావాలని వైసీపీ నేతలను కోరారట. అయితే... వారు రూ.కోటి ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం అని చెప్పారట. దీంతో తాను సైలెంటు అయిపోయానని పీటర్ ఆరోపించారు.

అంతేకాదు.. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం నామినేషన్ వేస్తే తనపై ఒత్తిడి తెచ్చి మరీ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. కొన్ని డివిజన్లకు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు పనులు కేటాయించి తనకు మాత్రం రూ.18 లక్షలే కేటాయించారని ఆరోపించారు. తన సోదరుడు గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉండేవారని... టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఆయనను కొనసాగించారని... వైఎస్ బంధువన్న కారణంతో తొలగించాలని చంద్రబాబుకు చాలామంది సూచించినా ఆయన అలాంటిదేమీ పట్టించుకోకుండా కొనసాగించారని ఛెప్పారు. అలాగే పులివెందులలో డిగ్రీ కాలేజికి నిధులు 125 పోస్టులు ఇచ్చిన క్రెడిట్ కూడా చంద్రబాబుదేనని చెబుతూ.. అందుకే టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. మొత్తానికి చేప చిన్నదైనా జగన్ చెరువులోనిది కావడంతో ఆయన చేరికకు ప్రాధాన్యం ఏర్పడింది.