Begin typing your search above and press return to search.

కడపలో కమలం: వైఎస్సార్‌ జిలాలో వైకాపా పరిస్థితి?

By:  Tupaki Desk   |   20 Jan 2015 11:30 AM GMT
కడపలో కమలం: వైఎస్సార్‌ జిలాలో వైకాపా పరిస్థితి?
X
వైఎస్సార్‌ జిలాగా పిలుచుకునే కడపలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం నిన్నటివరకూ రికార్డ్‌ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే స్థాయిలో ఉండేది! 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ బలం కాస్త తగ్గినట్లే కనిపించింది! అయితే ఇప్పటికే టీడీపీకి నలుమూలల నుండి చెక్‌ పెట్టేస్తోన్న బీజేపీ తాజాగా వైఎస్సార్‌ పార్టీపై పడింది! అక్కడ నుండి ఇక్కాడి నుండి ఎందుకు, ఏకంగా కడప నుండే వైకాపా కు చెక్‌ పెడదామని నిర్ణయించుకుంది! అనుకున్నదే తడవుగా... పని ప్రారంభించేసింది! దీంతో కడపజిల్లా రాజకీయం రసకందాయంలో పడినట్లయ్యింది! ఈ జిల్లాలో అనూహ్యంగా భారతీయ జనతాపార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటోంది!

జిల్లా కేంద్రమైన కడపతో పాటు కడప పార్లమెంటు పరిధిలో బలమైన నాయకత్వం కలిగిన కందుల సోదరులు బిజెపీలోకి అడుగు పెట్టేశారు! ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలోనే బిజెపిలోకి అడుగు పెట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కడప జిల్లాకు చెందిన తృతీయ శ్రేణి నాయకులు చాలావరకూ వచ్చి చేరిపోయారు! కడప జిల్లా పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి, బిజేపీలో సీనియర్‌ నాయకుడిగా పేరొందిన వెంకయ్యనాయుడు సమక్షంలో కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డితో పాటు ఆయన సోదరుడు కె.రాజమోహన్‌ రెడ్డి, వారి అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలోకి అడుగు పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తోన్నాయి! ఈ ప్రచారాలు ఇలా కొనసాగుతూనే ఉండగానే పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పటికే బీజెపీతో జతకట్టి పార్టీకి కడపలో బలం పెంచేపనికి పూనుకున్నారు! వీరి చేరిక బిజెపీలోని పార్టీ నాయకులకు కొంత ఇబ్బందిని కలిగిస్తున్నా, రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేయాలన్న పార్టీ పెద్దల నిర్ణయంతో మిన్నకుండిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి!

అయితే... ఒక్కో నియోజకవర్గానికి సంబందించి ముగ్గురు, నలుగురు బలమైన నాయకులు (ఎమ్మెల్యే క్యాండిడేట్లు) చేరడం భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని, ఇది కేవలం వాపుగానే మిగిలిపోతోంది తప్ప బలంగా మారే అవకాశాలు తక్కువని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తోన్నారు! కానీ భారతీయజనతా పార్టీకి విపరీతంగా క్రేజ్‌ఉన్నదనడానికి ఇది నిదర్శనం అనడంలో మాత్రం సందేహం లేదు. కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని తాత్కాలిక ప్రయోజనాలకోసం వచ్చి చేరేవారిని దూరం పెట్టడం వల్ల నిజమైన కార్యకర్తలకు స్థానం కల్పించినవారవుతారని, అలా కానిపక్షంలో ... పార్టీలో సభ్యుల సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రజల్లో పెరగదని పలువురి వాదన! ఏది ఏమైనా... ఏపీలో బీజేపీ పనులు మాత్రం చాలా సీరియస్‌ గానే కొనసాగిస్తోంది!