Begin typing your search above and press return to search.

రాజధానిపై వైసీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్ విన్నారా?

By:  Tupaki Desk   |   29 Dec 2019 2:53 PM GMT
రాజధానిపై వైసీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్ విన్నారా?
X
ఏపీకి మూడు రాజధానుల దిశగా కదులుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరికొత్త డిమాండ్లు గుట్టలుగా వచ్చి పడుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే అమరావతిలోని రాజధానిని కేవలం శాసన వ్యవహారాల రాజధానిగానే పరిమితం చేసేసి... పాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజదానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామన్న దిశగా జగన్ స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. అయితే ఇప్పటికే రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన తమను అన్యాయం చేయరాదంటూ అమరావతి రైతులు జగన్ కు మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీకి చెందిన కీలక నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి ఇప్పుడు సరికొత్త డిమాండ్ ను వినిపించారు.

సొంత జిల్లా అనంతపురానికి ప్రాధాన్యమివ్వాలన్న దిశగా పీవీ సిద్ధారెడ్డి వినిపించిన వాదన ఓ రకంగా ఆ జిల్లా వాసులకు ఆమోదయోగ్యంగానే కనిపిస్తున్నా... మిగిలిన వారికి మాత్రం ఈ ప్రతిపాదన ఒకింత ఎబ్బెట్టుగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయినా సిద్ధారెడ్డి డిమాండ్ ఏమిటన్న విషయానికి వస్తే... అమరావతిలో అసెంబ్లీ కొనసాగుతున్నా... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా కొత్త రూపును సంతరించుకున్న విశాఖలో వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా అడుగులు పడుతుండగా... కొత్తగా అనంతపురంలోనూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని సిద్ధారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం అనంతపురంలోనూ అసెంబ్లీని నిర్మించాలని కూడా ఆయన కోరారు.

అనంతపురంలో అసెంబ్లీ నిర్మాణం వరకే సిద్ధారెడ్డి పరిమితం కాలేదండోయ్. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు అయితే, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి పథంలో దూసుకెళతాయని అభిప్రాయపడ్డ సిద్ధారెడ్డి... ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు - మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. చూడ్డానికి కాస్తంత వింతగానే ఉన్న సిద్ధారెడ్డి డిమాండ్ పై జగన్, వైసీపీ అధిష్ఠానం ఏమంటుందో చూడాలి.