Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం రాజీనామా చేస్తాననే వరకు...
By: Tupaki Desk | 19 Oct 2017 5:12 AM GMTతెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యర్థి పార్టీల రాజకీయాల పట్ల తీవ్ర కలత చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో వేడెక్కుతున్న వరంగల్ రాజకీయాల్లో భాగంగా ఆయా పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు ఏకంగా రాజీనామా చేస్తానని కడియం ప్రకటించారు. వరంగల్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడుతూ కాంగ్రెస్ - టీడీపీలపై ఘాటైన విమర్శలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఏ పనికైనా లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీడీపీకి సవాల్ విసిరారు.
తెలంగాణ వస్తుందో రాదో - వస్తే అధికారంలోకి వస్తుందో రాదో అని తీవ్ర మనస్తాపానికి గురై టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరానని కడియం శ్రీహరి అన్నారు. కడియం శ్రీహరి అంటేనే ఆత్మగౌరవానికి నిదర్శనమని - తెలంగాణ టీడీపీ నాయకులకు ఇంకా ఆత్మగౌరవముందా ? అని ప్రశ్నించారు. వైఎస్ దోపిడీలో జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి బ్రోకర్ గా వ్యవహరించి జిల్లాకు అపఖ్యాతి తెచ్చాడని పరోక్షంగా పొన్నాల లక్ష్మయ్యను ఉపముఖ్యమంత్రి విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారని కడియం అన్నారు. ఈ దోపిడీ ఫలితంగానే జగన్ నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇలాంటి కాంగ్రెస్ నేతలు చరిత్ర మరిచి తనపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇసుక దందా - బ్యాంకుల దోపిడీ - యూనివర్సిటీ భూముల కబ్జా - సెటిల్ మెంట్లు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. అందరిని ఒకే గాటిన కట్టి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.