Begin typing your search above and press return to search.

అవినీతిపై కడియం లాజిక్కు వినాల్సిందే బాస్

By:  Tupaki Desk   |   19 Oct 2016 5:09 AM GMT
అవినీతిపై కడియం లాజిక్కు వినాల్సిందే బాస్
X
ఒక పనిలో అవినీతి జరిగిందా? లేదా? అన్నది ఎలా చూస్తాం అంటే.. ఎవరికి వారు చాలానే లెక్క చెబుతారు. అవినీతి జరగటానికి.. పనికి ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయం వ్యాపార లెక్కలు తెలిసిన బుజ్జాయి సైతం ఇట్టే చెప్పేస్తారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాత్రం ఏదైనా పథకంలో అవినీతి అన్నది జరిగితే ఎలా ఉంటుందో తెలుసా అంటూ.. పాలపీక నోట్లో పెట్టుకున్న పిల్లలకు చెప్పినట్లుగా చెప్పిన ముచ్చట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పనుల్లో నాణ్యత లేకపోవటమే అవినీతికి కొలమానం అన్నట్లుగా మట్లాడుతున్న కడియం శ్రీహరి.. తన మాటలు అప్ గ్రేడ్ కాలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి. ఎందుకంటే.. ఇలాంటి మాటలు.. ఎనభైల్లోనో.. తొంభైల్లోనే చెబితే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో అవినీతికి.. జరిగే పనికి ఏ మాత్రం సంబంధం లేదన్నది అందరికి తెలిసిందే.

తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున చేపట్టిన మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణ అధికారపక్ష నేతలకు మిషన్ కాకతీయ పనులు మాంచి టిఫిన్ గా మారినట్లుగా తెలంగాణ సర్కారును విమర్శించే వారు.. తప్పు పట్టే వారితో పాటు.. ఈ పనుల్ని నిశితంగా గమనిస్తున్న వారూ చెబుతుంటారు. తక్కువలో తక్కువ అంటే ఇరవై శాతం నుంచి 35 శాతం మధ్యలో ఖర్చును తేడాగా చూపించేశారన్న ఆరోపణ ఉంది.

అయితే.. ఇలాంటి ఆరోపణల్ని.. విమర్శల్ని కడియం శ్రీహరి బలంగా ఖండిస్తున్నారు. మిషన్ కాకతీయ పనుల్లో నిజంగా అవినీతి జరిగి ఉంటే.. ఇటీవల కురిసిన వర్షాలకు కట్టలు తెగాలని.. కానీ అలాంటివేమీ జరగలేదంటే.. అవినీతి జరగలేదనేగా అంటూ ఆయన చెబుతున్న లాజిక్ వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే. చేయాల్సిన పనిని పూర్తి చేస్తూనే.. నాలుగు రాళ్లు మిగిలేలా పనులు చేయటంలో మేధావితనం ప్రదర్శిస్తున్న ఇప్పటి కాంట్రాక్టర్ల గురించి ప్రజలకు తెలీదని కడియం అనుకుంటున్నారా? అన్నది ప్రశ్న. కడియం చెబుతున్నట్లుగా ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్టలు అస్సలు తెగలేదా? అంటే తెగాయనే చెప్పాలి. కాకుంటే.. ఆ తెగిన లెక్క తక్కువగా ఉండటంతో ఈ అంశం పెద్దగా ఫోకస్ కాలేదని చెప్పాలి. ఈ మధ్యకాలంలో తెలుగు మీడియా ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ కోణాలపై ఎక్కువ దృష్టి పెట్టటంతో.. నెగిటివ్ లు పెద్దగా ఫోకస్ కాని పరిస్థితి. నెగిటివ్ కోణం అభివృద్ధికి విఘాతం అన్నట్లుగా వ్యవహరిస్తున్న మీడియా పుణ్యమా అని.. కడియం లాంటోళ్లు.. అవినీతికి.. చెరువు కట్టలకు లింకు పెట్టేసి మరీ మాట్లాడటం కనిపిస్తుంది. ఏమైనా ఒక పనిలో అవినీతి జరిగిందా? లేదా? అన్న విషయంపై చేసిన అవగాహన అదిరిపోయిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/