Begin typing your search above and press return to search.

కడియం కుమార్తె.. వరంగల్‌ ఎంపీ అభ్యర్థా..?

By:  Tupaki Desk   |   6 July 2015 10:23 AM GMT
కడియం కుమార్తె.. వరంగల్‌ ఎంపీ అభ్యర్థా..?
X
ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తప్పించిన నేపథ్యంలో.. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా పేరొందిన కడియం శ్రీహరిని ఎంపీ పదవి నుంచి డిఫ్యూటీ సీఎంగా చేయటం తెలిసిందే.

తాజాగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో వరంగల్‌ ఉప ఎన్నిక జరగటం ఖాయం. ఈ నేపథ్యలో తెలంగాణ అధికారపక్ష అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్నారని చెబుతున్నారు.

ప్రాధమికంగా ఓకే అయినప్పటికీ.. దీనిపై మరింత దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమచారం ప్రకారం.. వరంగల్‌ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె.. డాక్టర్‌ కావ్యను అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా కడియంకు ఉన్న రాజకీయ బలంతోపాటు.. ఆమె కుమార్తె అంటే కాస్తంత భావోద్వేగం కలుస్తుందని.. దీంతో రాజకీయ ప్రత్యర్థుల్ని సులభవంగా దెబ్బ తీయొచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని కడియంతో కేసీఆర్‌ చర్చించారని చెబుతున్నారు. ఇక.. కడియం కుమార్తెను అభ్యర్థిగా నిలిపితే వచ్చే ప్రతికూల పరిణామాలను అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం వరంగల్‌ మెడికల్‌కాలేజీలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త మహ్మద్‌ నజీర్‌ కూడా డాక్టర్‌గానే సేవలు అందిస్తున్నారు. సామాజికంగా కూడా కావ్య అభ్యర్థిత్వం వ్యూహాత్మకంగా వర్క్‌వుట్‌ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరంగల్‌ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవటం టీఆర్‌ఎస్‌కు అత్యంత ముఖ్యమైన నేపథ్యంలో కడియం కుమార్తెకు మించిన మంచి ఆప్షన్‌ మరొకటి ఉండదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి..దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి.