Begin typing your search above and press return to search.

కడియంకు నిజంగా జ్వరం వచ్చిందా..?

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:05 AM GMT
కడియంకు నిజంగా జ్వరం వచ్చిందా..?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రమైన మనస్తత్వం గురించి తెలియంది కాదు. ఆయన పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారో.. ఎప్పుడూ ప్రాధాన్యత కోల్పోతారో తెలియని పరిస్థితి. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. సుదీర్ఘ కాలం పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర చాలా కీలకమైంది. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మధ్యలో చాలానే మజిలీలు ఉన్నాయి.

అయితే.. ఒక్కో మజిలీ వద్ద ఒక్కో నేత కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం కనిపిస్తుంది. టీఆర్ ఎస్ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి తెలంగాణ సాధన వరకూ ఒకేలాంటి ప్రాధాన్యతతో ఉన్న నేత పార్టీలో కలిపించరు. అది కేసీఆర్ స్టైల్ గా చెబుతారు. దివంగత అలె నరేంద్ర వ్యవహారమే తీసుకుంటే.. టీఆర్ ఎస్ అంటే కేసీఆర్.. నరేంద్రలు రామలక్ష్మణులుగా కలిసి నడిపించటం తెలిసిందే.

ఆ తర్వాత పలువురు నేతలతో పాటు.. విజయశాంతి కూడా అమితమైన ప్రాధాన్యతను పొందారు. పార్టీకి ఆడబడుచుగా వ్యవహరిస్తూ.. పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి ఆమె.. ఆ తర్వాత పార్టీ నుంచే బయటకు వచ్చేసే పరిస్థితి. ఇలా ఎవరు.. ఎప్పుడు.. ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా వరంగల్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతున్న వేళ.. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఫ్యామిలీకి అవకాశం ఇవ్వాలన్న మాట జోరుగా వినిపిస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన.. గురువారం వారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ ఉఫ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థిగా.. రాజయ్య సతీమణికి అవకాశం లభించనుందన్న వాదనలు జోరుగా వినిపిస్తున్న వేళ.. కడియంకు ఇది ఏమాత్రం నచ్చటం లేదని చెబుతున్నారు. ఒకే జిల్లాకు చెందిన వీరిద్దరి మధ్య ఏ మాత్రం సంబంధాలు లేవన్న విషయం అందరికి తెలిసిన విషయమే. రాజయ్య ఫ్యామిలీకి వరంగల్ ఉప ఎన్నికకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ అనుకోవటం కడియంకు నచ్చలేదని చెబుతున్నారు. అందుకే ఆయన.. కీలకమైన శాసనసభాపక్ష సమావేశానికి డుమ్మా కొట్టినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఇందులో వాస్తవం లేదని.. కడియంకు జ్వరమని అందుకే ఆయన సమావేశానికి రాలేదని చెబుతున్నారు. ఇదే అంశాన్ని పార్టీకి చెందిన ఒక నేత స్పందిస్తూ.. ‘‘నిజమే.. అసంతృప్తి కూడా ఒక జ్వరమే సుమా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు లోగుట్టుగా చేయటం గమనార్హం. కేసీఆర్ లాంటి అధినేతతో సర్దుకుపోవటమే కాదు.. జ్వరాలతో దూరం జరగటం మంచిది కాదన్న విషయం కడియంకు తెలీదా..?