Begin typing your search above and press return to search.

కేటీఆర్ ను కడియం ఎంతలా పొగిడేశారంటే..

By:  Tupaki Desk   |   3 Nov 2016 6:09 AM GMT
కేటీఆర్ ను కడియం ఎంతలా పొగిడేశారంటే..
X
పార్టీలో నెంబర్ టూగా ఒక వెలుగు వెలుగుతున్న.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని తెలంగాణ అధికారపక్ష నేతలు పెద్దగా చేయలేదని చెప్పాలి. తాజాగా మాత్రం ఆ లోటును కూడా తీర్చేసే కార్యక్రమాన్ని వారు షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న కేటీఆర్ పై తాజాగా తెలంగాణ సీనియర్ నేత.. విశేష రాజకీయ అనుభవం ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన పొగడ్తలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

రాష్ట్రంలో కేటీఆర్ ఐటీ.. పరిశ్రమల శాఖల్ని పరుగులు పెట్టిస్తున్నారని క‌డియం పొగిడేశారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనలోనూ.. పెట్టుబడుల్ని రాబ్టటటంలోనూ కేటీఆర్ చురుకైన పాత్రను పోషిస్తున్నారని పొగిడేశారు. తన మాటలకు సాక్ష్యాలన్నట్లుగా ఇటీవల వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో తెలంగాణ స్టేట్ కు వచ్చిన నెంబర్ వన్ ర్యాంక్ గురించి ప్రస్తావించిన కడియం.. కేటీఆర్ ను పొగిడేశారు. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ర్యాంకును ఈ సారి నెంబర్ వన్ కు తీసుకొచ్చిన కేటీఆర్ ను దేశమంతా చూస్తుందని పొగిడేశారు.

కడియం ఈ రేంజ్ లో పొగిడేసిన తర్వాత మరో సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఊరుకుంటారా? ఆయన కూడా కేటీఆర్ ను పొగడేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో తన సొంత మండలం ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లా కిందకు వస్తుందని.. అందుకే ఆ జిల్లా కూడా తమ పరిధిలోకి వచ్చిందని.. అందుకే తానీ సభకు వచ్చినట్లుగా ఈటల చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సమర్థత గురించి చెప్పేశారు. మరింత సమర్థుడైన కేటీఆర్.. హైదరాబాద్ రోడ్లను ఇన్ని నెలలు గడుస్తున్నా ఒక కొలిక్కి ఎందుకు తీసుకురాలేదు. వందలాది కిలోమీటర్లు రోడ్ల మీద గుంతలు పడిపోయి.. నగర జీవి నానా కష్టాలు పడుతున్న వేళ.. కేటీఆర్ సమర్థత మీద పలువురికి సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ.. కడియం లాంటోళ్లు విపరీతంగా పొగిడేయటం చూస్తుంటే..తెలంగాణ అధికారపక్ష నేతలు పని మీద కంటే ప్రచారంతో కేటీఆర్ ఇమేజ్ పెంచేసేటట్లున్నారే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/