Begin typing your search above and press return to search.

జీవితంలో కాంగ్రెస్ కు ఓటేయలేదు: కడియం

By:  Tupaki Desk   |   1 Oct 2018 5:14 AM GMT
జీవితంలో కాంగ్రెస్ కు ఓటేయలేదు: కడియం
X
ముందస్తు ఎన్నికల సమయమిదీ.. ఎక్కడ ఏ నేత సైలెంట్ ఉన్నా కానీ.. గాసిప్పులు అల్లేస్తున్నారు. ఆయన అలక వహించాడని పార్టీ మారుతున్నాడని పుకార్లు షికార్లు చేయిస్తున్నారు. ఎన్నికల వేళ నిప్పులు లేనిదే పొగ రాదు కదా.. టీడీపీలో పుట్టి.. ఇప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగుతూ తెలంగాణ డిప్యూటీ సీఎంగా అందరికీ చిరపరిచితమైన కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నాడని గడిచిన మూడు నాలుగు రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇవి దుమారం రేగడంతో దీనిపై ఆయనే బయటకు వచ్చి తాజాగా విలేకరులకు క్లారిటీ ఇచ్చారు.

నైతిక విలువలు, నీతి నిజాయితీలే పెట్టుబడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నాని.. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యం అంటూ వివరణ ఇచ్చారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరించారు. ఈ మధ్య సోషల్ మీడియాలో తాను టీఆర్ఎస్ వీడి.. కాంగ్రెస్ లో చేరబోతున్నాననే ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని ప్రజలు, మీడియా నమ్మవద్దని కోరారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న తాను కాంగ్రెస్ లో ఎలా చేరుతానని నిలదీశారు.

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ నుంచి పోటీచేయాలని తనను అక్కడి అసమ్మతి నేతలు అడిగారని..కానీ కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కడియం స్పష్టం చేశారు. అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు త్వరలోనే సమసిపోతాయని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదని పేర్కొన్నారు. మహాకూటమి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని విమర్శించారు.