Begin typing your search above and press return to search.

విదేశీ పర్యటనలపై కోర్టులో పిటీషన్

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:50 AM GMT
విదేశీ పర్యటనలపై కోర్టులో పిటీషన్
X
ముఖ్యమంత్రులు, మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళేటపుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తు ఢిల్ల హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఆప్ మంత్రి కైలాస్ గెహ్లోత్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. విషయం ఏమిటంటే ఈమధ్య సింగపూర్ వెళ్ళేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి కోరితే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీని కారణంగా కేజ్రీవాల్ సింగపూర్ వెళ్ళలేకపోయారు.

సింగపూర్లోని ఒక సంస్ధ ప్రపంచ అర్బన్ నగరాల అభివృద్ధిపై ఆగష్టు ఒకటో తేదీ సదస్సు ఏర్పాటుచేసింది. సదస్సులో పాల్గొనాల్సిందిగా కేజ్రీవాల్ ను ఆహ్వానించింది. సదస్సులో పాల్గొనే ఉద్దేశ్యంతో సీఎం ముందు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అనుమతి అడిగారు. దాదాపు నెలరోజులు ఆ ఫైల్ తనదగ్గరే ఉంచుకున్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ చివరకు నిరాకరించారు. వెంటనే కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. కొద్దిరోజులు ఫైలును తన దగ్గరే ఉంచుకున్న కేంద్రం కూడా అనుమతి నిరాకరించింది.

కేజ్రీవాల్ సింగపూర్ ప్రయాణానికి అనుమతి నిరాకరించటంలో రాజకీయ కారణాలు తప్ప ఇంకేమీ కనబడలేదు. విచిత్రం ఏమిటంటే ’అర్బన్ నగరాల అభివృద్ధంటే మేయర్లు పాల్గొనాలి కానీ ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళి ఏమిచేస్తారం’టు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కేజ్రీని ప్రశ్నించటం.

నరేంద్రమోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడదన్న విషయం తెలిసిందే. దాని మనసులో పెట్టుకుని సీఎం విదేశీ ప్రయాణానికి అనుమతి నిరాకరించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ మంత్రి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

అసలు సీఎం అయినా మంత్రులైనా విదేశాల్లో ప్రయాణించాలంటే అందుకు కేంద్రం నుంచి ఎందుకు అనుమతి తీసుకోవాలంటు తన పిటీషన్లో ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల అధికార, వ్యక్తిగత పర్యటనలకు విదేశాలకు వెళ్ళే విషయంలో తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి కోరారు.

ఒకవైపు విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళుతుండగానే కేవలం కేజ్రీవాల్ కు మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కోణమే అని స్పష్టంగా అర్ధమవుతోంది.