Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి విగ్ర‌హ తొల‌గింపు..అడిగిన జ‌గ‌న్ పార్టీ నేత అరెస్ట్‌

By:  Tupaki Desk   |   13 May 2018 4:55 AM GMT
అర్థ‌రాత్రి విగ్ర‌హ తొల‌గింపు..అడిగిన జ‌గ‌న్ పార్టీ నేత అరెస్ట్‌
X
కార‌ణం ఏదైనా కానీ.. అంద‌రితో మాట్లాడితే స‌మ‌స్య‌లు సామ‌ర‌స్యంగా ముగిసిపోతాయి. కానీ.. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో అన‌వ‌స‌ర రాద్దాంతం త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. తాజాగా అలాంటి ప‌రిస్థితి విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది. జై ఆంధ్రా ఉద్య‌మ‌నేత కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని తొల‌గించేందుకు బెజ‌వాడ పోలీసులు నిర్ణ‌యం తీసుకోవ‌టం ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైంది.

శ‌నివారం అర్థ‌రాత్రి వేళ బెంజ్ స‌ర్కిల్ లోని కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని తొల‌గించాలని పోలీసులు నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన స‌మాచారం విగ్ర‌హ క‌మిటీకి కానీ.. ఏ ఒక్క‌రికి ఇవ్వ‌లేదు. విగ్ర‌హ తొల‌గింపుపై స‌మాచారం ఇవ్వ‌కుండా ఎలా తొల‌గిస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత య‌ల‌మంచిలి ర‌వి అడ్డుకున్నారు.

దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. గుట్టుచ‌ప్పుడు కాకుండా విగ్ర‌హాన్ని తొల‌గించాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించిన య‌ల‌మంచిలి ప్రొక్ల‌యిన్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. విగ్ర‌హాన్ని తొల‌గించే విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వ‌ని పోలీసులు.. ఆందోళ‌న చేప‌ట్టిన య‌ల‌మంచిలిని బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు.

అనంత‌రం భారీ బందోబ‌స్తుతో వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని తొల‌గించారు. అర్థ‌రాత్రి వేళ ఎవ‌రికి స‌మాచారం ఇవ్వ‌కుండా విగ్ర‌హాన్ని తొల‌గించ‌టంపై తీవ్ర నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు య‌ల‌మంచిలి. పోలీసులు నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. విగ్ర‌హం తొల‌గింపుపై ఎవ‌రికి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. పోలీసుల దౌర్జ‌న్యం స‌రికాద‌న్నారు. పోలీసుల చ‌ర్య‌ను ప్ర‌శ్నిస్తే అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌న్నారు. తాజా ప‌రిణామంతో ఉద్రిక్త ప‌రిస్థితి చోటు చేసుకుంది.