Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో పొలిటిక‌ల్ కాక‌!

By:  Tupaki Desk   |   17 Sep 2021 2:30 PM GMT
కాకినాడ‌లో పొలిటిక‌ల్ కాక‌!
X
2019 ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించిన జ‌గ‌న్ తొలిసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ సాధించిన విజ‌యం ఆ పార్టీపై ప్ర‌జ‌ల‌కున్న ఆద‌ర‌ణ‌ను ఘ‌నంగా చాటింది. ఆ త‌ర్వాత స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా అత్య‌ధిక గ్రామాల్లో సర్పంచ్‌లు పుర‌పాలిక సంఘాల్లో మేయ‌ర్లు ఆ పార్టీకి చెందిన‌వాళ్లే ఉన్నారు. ఇక ఒక‌టో రెండు చోట్ల‌నో టీడీపీ అధికారంలో ఉన్న కార్పోరేష‌న్‌లోనూ మేయ‌ర్ పీఠాన్ని త‌మ వ‌శం చేసుకునేందుకు వైసీపీ గ‌ట్టిగానే ప్రయ‌త్నిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆ బాధ నుంచి తేరుకుని పార్టీని తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా న‌డిపించేందుకు సిద్ధ‌మ‌యారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిణామాలు ఆ పార్టీకి ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు కాకినాడ కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్‌లో రాజ‌కీయ కాక మొద‌లైంది. టీడీపీ మేయ‌ర్ పావ‌నిపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మొత్తం 50 డివిజ‌న్లు ఉన్న కాకినాడ కొర్పొరేష‌న్‌లో టీడీపీ నుంచి 33 మంది, వైసీపీ నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురు, ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో గెలిచారు. స్ప‌ష్ట‌మైన ఆధిక్యం సాధించిన టీడీపీ.. మేయ‌ర్‌గా పావనిని గ‌ద్దెక్కించింది. కానీ త‌ద‌నంత‌ర పరిణామాల కార‌ణంగా కొంత‌మంది కొర్పొరేట‌ర్లు వైసీపీ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీ బ‌లం 34కి చేరింది. దీంతో ఇప్పుడీ కార్పొరేట‌ర్లు మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు కొత్త మేయ‌ర్ ఎవ‌రు అవుతార‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది. 40వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ శివ ప్ర‌స‌న్న‌కు ఆ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు వైసీపీ నేత‌లు పావులు క‌దుపుతున్నార‌ని పావ‌ని ఆరోపిస్తున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అవినీతిని అడ్డుకున్నందుకే త‌న‌పై కుట్ర చేశార‌ని ఆమె పేర్కొన్నారు. టీడీపీ కార్పొరేట‌ర్ల‌ను బెదిరించి త‌మ‌వైపున‌కు తిప్పుకున్నార‌ని అందుకు ప్ర‌తిఫ‌లంగా రాబోయే రోజుల్లో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి గుణ‌పాఠం చెబుతాన‌ని పావ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె వ్యాఖ్య‌ల‌కు చంద్రశేఖ‌ర్‌రెడ్డి ధీటుగానే స‌మాధాన‌మిచ్చారు. మేయ‌ర్ పావ‌నిపై సొంత పార్టీ కొర్పొరేట‌ర్లే అసంతృప్తితో ఉన్నార‌ని అందుకే పార్టీల‌క‌తీతంగా కార్పొరేట‌ర్లంద‌రూ ఏక‌మై అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాలు విసిరారు. మొత్తానికి ఈ కార్పొరేష‌న్ వైసీపీ సొంతమ‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త‌మ చేతుల్లో నుంచి మేయ‌ర్ పీఠం జారిపోతున్న టీడీపీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.