Begin typing your search above and press return to search.

కాకినాడ 'పీపీ'ని మర్డర్ చేసిన భార్య.. 59 రోజుల తర్వాత బయటకు

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:30 AM GMT
కాకినాడ పీపీని మర్డర్ చేసిన భార్య.. 59 రోజుల తర్వాత బయటకు
X
దాదాపు రెండు నెలల క్రితం కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అక్బర్ అజాం మరణించారు. 50 ఏళ్ల వయసులో ఆయన అర్థాంతరపు చావును 'కరోనా' ఖాతాలో వేసేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మధ్య వయస్కులు ఉన్నట్లుండి హటాత్తుగా మరణిస్తున్న వైనం తెలిసిందే. అదే రీతిలో ఆయన కూడా ఏదో ఆరోగ్య సమస్యతో సహజంగా మరణించారని భావించారు. అయితే.. ఆయన మరణించిన 59 రోజుల తర్వాత ఆయనది సహజ మరణం కాదని.. కట్టుకున్న భార్యే ప్లానింగ్ చేసి మరీ చంపించిందన్న దారుణ నిజం బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే..

పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజాం మొదటి భార్య 15 ఏళ్ల క్రితం పాపకు జన్మనిచ్చి మరణించింది. అనంతరం యానాంకు చెందిన 36 ఏళ్ల అహ్మదున్నీసా బేగంను రెండో పెళ్లి చేసకున్నారు. వీరికి కుమార్తె.. కుమారుడు సంతానం.

ఆజాం తల్లిదండ్రులు కాకినాడలో ఉంటారు. ఇటీవల ఆయన హటాత్తుగా మరణించారు. అందరూ సహజ మరణం అని భావించారు. ఆయన మరణించి దాదాపు రెండు నెలల వరకు అవుతోంది. ఇలాంటి వేళలోనూ అనుకోని పరిణామం చోటు చేసుకుంది. ఆజాం మరణించటానికి ముందు తన భార్య వాడే సెల్ ఫోన్ ను తన తండ్రికి ఇచ్చేసి.. కొత్త ఫోన్ ను ఆమెకు ఇచ్చారు.

కొడుకు మరణించిన నేపథ్యంలో.. అనుకోకుండా పాత వాట్సాప్ ఛాటింగ్స్.. వాయిస్ మెసేజ్ లను గమనించారు. అందులో ఆయన గుండెపగిలే విషయాలు ఉన్నాయి. ఆజాం ఉండే అపార్టమెంట్ పై ప్లాట్ లో ఉండే రాజస్థాన్ కు చెందిన రాజేష్ జైన్ తో పాటు మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్ తో కోడలు అహ్మదున్నీసా జరిపిన సంభాషణలు ఉన్నాయి. వాటి ఆధారంగా కొడుకుది హత్యగా ఆయన గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు గుట్టుగా విచారించారు. ఆ సందర్భంగా వారికి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

దీని ప్రకారం రాజేశ్ జైన్.. కిరణ్ తో సన్నిహితంగా ఉండే అహ్మదున్నీసా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా జూన్ 23న భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్ తనతో తెచ్చుకున్న క్లోరోఫాంను గుడ్డలో వేసి ఆజాం ముక్కు వద్ద గట్టిగా అదిమి పెట్టారు. దీనికి ఆమె సహకరించింది. ఆ సమయంలోరాజేష్ జైన్ బయట కాపలాగా ఉన్నారు.

మత్తు మోతాదు ఎక్కువగా ఉండటంతో ఆజాం మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా భార్యే ఎందుకు చేసిందన్న వివరాలు బయటకురావాల్సి ఉంది. తమకు అందిన సమాచారంతో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆజాం భార్య అహ్మదున్నీసా బేగం.. కిరణ్.. రాజేష్ జైన్ లను అరెస్టు చేశారు. మరణించిన 59 రోజుల తర్వాత శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో మిగిలిన విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.