Begin typing your search above and press return to search.

మోకాలికీ బోడిగుండుకీ ముడి!

By:  Tupaki Desk   |   29 April 2018 4:20 AM GMT
మోకాలికీ బోడిగుండుకీ ముడి!
X
కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు చేసిన రాజీనామాలు మాత్రం ఒక్కరోజులో ఆమోదం పొందాయి గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలు ఇప్పటిదాకా ఆమోదం పొందలేదు ఎందుకు? ఇలాంటి తలాతోకా లేని ప్రశ్న వేసిన వాళ్ల రాజకీయ అవగాహన గురించి ఏం అనుకోవాలి. వారి అజ్ఞానం వలన మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతున్నారని అనుకోవడం తప్ప మరేం చేయలేం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు... ఆ తరహాలోనే మాట్లాడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందలేకపోవడం అంటే ఆయనకు చాలా చింత కలుగుతున్నట్లుగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి బంధం అంటగట్టి.. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ క్రెడిబిలిటీ మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి తెలుగుదేశం పార్టీ నానా పాట్లు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ ఎంపీల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందకపోవడాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కళా వెంకట్రావు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

నిజానికి ఎంపీల రాజీలనామాలు అనేవి ఆమోదం పొందడానికి ఒక పద్ధతి - ప్రక్రియ ఉంటుంది. స్పీకరు వారిని పిలిపించి మాట్లాడాల్సి ఉంటుంది. అవి ఆవేశంలో చేసిన రాజీనామాలు కాదని.. బుద్ధిపూర్వకంగానే చేశారని ఆమె విశ్వసించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆమోదం పొందుతాయి. అదే కేంద్రమంత్రుల రాజీనామాలు అనేవి కేవలం ప్రధాని ఇష్టానికి సంబంధించినవి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన తర్వాత.. ఆ పార్టీకి చెందిన కేంద్రంమంత్రులు రాజీనామా చేయకపోయినా సరే.. వారిని బర్తరఫ్ చేయడానికి కూడా ప్రధానికి అధికారం ఉంటుంది. అందుచేతనే ఆయన తక్షణం ఆ రాజీనామాలను ఆమోదించేశారు.

ఆ మాత్రం కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా కళా వెంకట్రావు విమర్శలు చేయడం ఆయన సీనియారిటీని నవ్వుల పాలు చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.