Begin typing your search above and press return to search.

`క‌ళా`.. విహీన రాజ‌కీయ‌మేనా?.. సోష‌ల్ మీడియా టాక్‌!!

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:03 PM GMT
`క‌ళా`.. విహీన రాజ‌కీయ‌మేనా?.. సోష‌ల్ మీడియా టాక్‌!!
X
రాజ‌కీయాల్లో ఎత్తులు.. పై ఎత్తులు కొత్త‌కాదు. ఎవ‌రికి వారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తేనే రాజ‌కీయాల్లో నాలుగు కాలాలు మ‌న ‌గ‌లిగేది. అయితే.. ఈ ఎత్తులు ఎవ‌రు ఎవ‌రిపై వేయాల‌నేదే కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ఒక‌ప్పుడు రాజ‌కీయ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసేవారు. అయితే.. ఈ విధానం రానురాను మారిపోయింది. త‌మ ఉనికిని చాటుకునేందుకు.. త‌మ‌కు ప్రాధాన్యం పెంచుకునేందుకు నాయ‌కులు సొంత పార్టీల‌పైనే ఎత్తులు వేస్తున్నారు. పార్టీ అధినేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పు కొంటున్నారు. గ‌తంలో ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పోయింద‌ని.. త్వ‌ర‌లోనే తాను రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల‌ను తీవ్ర కుదుపున‌కు గురి చేసింది. క‌ట్ చేస్తే.. ఇదంతా వ్యూహం ప్ర‌కారం జేసీ వేసిన ఎత్తుగ‌డ‌గా రెండు మూడురోజుల్లోనే తేట‌తెల్లం అయిపోయింది. ప‌ట్టిసీమ నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు నీరివ్వాల‌న్న త‌న అభ్య‌ర్థ‌న‌ను అప్ప‌టి మంత్రి దేవినేని ఉమా ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో ఎలాగైనా లైన్‌లోకి తెచ్చుకోవాల‌నే వ్యూహం వేసి.. ఇలాంటి కామెంట్లు చేశారు. అనుకున్న‌ది సాధించారు. జేసీ వ్యాఖ్య‌ల‌పై హుటాహుటిన స్పందించిన చంద్ర‌బాబు(కేబినెట్ మీటింగ్‌లో ఉండి కూడా) విష‌యాన్ని తేల్చాల‌ని మంత్రి ఉమాను ఆదేశించారు. ఆ వెంట‌నే కొంత నీటిని అనంత‌పురానికి పారించారు. ఇక‌, ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. జేసీ రాజీనామా విష‌యం అట‌కెక్కింది.

ఇంత‌కీ చెప్పొ‌చ్చేదేంటంటే.. నాయ‌కులు త‌మ కోరిక‌లు తీర్చుకునేందుకు సొంత‌పార్టీపైనే అస్త్ర ప్ర‌యోగం చేస్తార‌ని! ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు.. పార్టీ మారుతు న్నార‌నే ప్ర‌చారం ఒక్క‌సారిగా సంచ‌ల‌నం రేపింది. త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని, క‌ళా వెంక‌ట్రావును పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు నేరుగా ఆయ‌న ఇంటికి వెళ్ల‌నున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఈ భేటీ జ‌ర‌గ‌నుంద‌ని సంచ‌ల‌న వార్త‌లు స్క్రోల్ అయ్యాయి. వాస్త‌వానికి ఈ విష‌యం సాధార‌ణ సోష‌ల్ మీడియాలోనో.. లేక వెబ్ సైట్ల‌లోనో వ‌స్తే.. ఇంత తీవ్ర‌త ఉండేదికాదు. ప్ర‌ధాన మీడియా స్ర‌వంతిలోనే క‌ళా పార్టీ మార్పుపై తీవ్ర‌ప్ర‌చారం జ‌రిగింది.

ఉరుములు లేని పిడుగు లాంటి వార్త‌.. టీడీపీతోపాటు.. రాష్ట్ర రాజకీయాల‌ను కూడా కొన్ని గంట‌ల‌పాటు షేక్ చేసింది. క‌ట్ చేస్తే.. దీనిపై తీరిగ్గా స్పందించిన క‌ళా వెంక‌ట్రావు.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. సోము తన ఇంటికి వస్తున్న విషయం కూడా తెలియదన్నారు. చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని ప్రకటించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అస‌లు ఇంత సంచ‌ల‌న విష‌యం వెలుగు చూడ‌డానికి కార‌ణ‌మేంటి? ప‌నిగట్టుకుని క‌ళాను రాజ‌కీయంగా డీగ్రేడ్ చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది? అనేది కీల‌క‌ప్ర‌శ్న‌. మ‌రోవైపు.. క‌ళా పార్టీ మార్పుపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు బాగానేఉంది. కానీ, ఇదే విష‌యంలో సోము కానీ, బీజేపీత‌ర‌ఫున మ‌రెవ‌రైనా కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

సో.. దీనిని బ‌ట్టి.. క‌ళాకు.. సోము కు మ‌ధ్య చ‌ర్చ అయినా.. జ‌రిగి ఉండాలి. లేదా.. త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డం, పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ళానే వ్యూహాత్మ‌కంగా ఇలా త‌న ఉనికిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నం అయినా చేసి ఉండాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో బాబును కాద‌ని.. వ‌ద్దువ‌ద్దు అన్నా కూడా విన‌కుండా.. ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా.. ఈ ప‌రిణామం.. క‌ళా విహీన రాజ‌కీయ‌మేన‌ని చెబుతున్నారు. ఇక‌, ఈ విష‌యంపై చంద్ర‌బాబు కానీ, పార్టీ అధ్య‌క్షుడు అచ్చెన్న కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం కూడా తెర‌వెనుక `ఏదో` జ‌రిగింద‌నే విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తోంద‌ని అంటున్నారు.