Begin typing your search above and press return to search.

ఏపీలో దున్నేసేందుకు బీజేపీ ప్లాన్ చూశారా?

By:  Tupaki Desk   |   12 April 2017 5:30 AM GMT
ఏపీలో దున్నేసేందుకు బీజేపీ ప్లాన్ చూశారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లోపేతం అయ్యేందుకు అధికార టీడీపీ మిత్రప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది అనేది ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ‌ల్లో ఉన్న మాట‌. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఇందుకోసం క్రియాశీల కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. అయితే ఇపుడు బీజేపీ త‌న వేగం పెంచుతోంది. ఏకంగా కేంద్ర మంత్రుల‌ను రంగంలోకి దించేస్తూ త‌న ప్లాన్‌ ను ముందుకు తీసుకుపోతోంది. క్షేత్ర‌స్థాయిలో ఎలా బ‌లోపేతం అవ్వాలో సిద్ధ‌మైంది. అందుకు ఏకంగా ఇటీవ‌ల దుమ్మురేపే విజ‌యాన్ని సాధించిన యూపీ వ్యూహాన్నే ఫాలో అవుతోంది.

శ్రీకాళహస్తి పట్టణంలో బూత్ స్థాయి కమిటీల సమావేశం నిర్వ‌హించగా దీనికి కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌ రాజ్ మిశ్రా హాజ‌ర‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర‌ మంత్రి మాట్లాడుతూ బూత్ కమిటీలు పటిష్టంగా ఉండటం వల్లే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో విజయం సాధించామని, అలాగే ఏపీలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం- పట్టణాలు-గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వాటిని పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈ కమిటీలే కీలక బాధ్యత వహించాయని విశ్లేషించారు. బూత్ స్థాయి కమిటీలు పటిష్టంగా ఉంటే ప్రతి ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చని కేంద్ర మంత్రి క‌ల్‌ రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రం అమలు చేస్తున్న జన్‌ధన్ యోజ‌న‌, దీపం వంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వీటిని గ్రామస్థాయికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. అనంతరం ఆయన సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు గ్రామంలో దళితవాడను సందర్శించి అక్కడ వారితో సహపంక్తి భోజనం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/